వారణాసిలో మోదీ స్వచ్ఛ భారత్..
- అస్సీ ఘాట్‌లో పూడిక తీసిన ప్రధాని
- ‘స్వచ్ఛ భారత్’లో పాల్గొనాల్సిందిగా యూపీ సీఎం అఖిలేశ్, క్రికెటర్లు రైనా, కైఫ్‌లకు పిలుపు
- వారణాసిలో బ్యాటరీ కార్లను ప్రవేశపెడతామని వెల్లడి
వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో శనివారం ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారణాసిలోని గంగానది తీరాన పూడికను తొలగించారు. అనంతరం ఉత్తరప్రదేశ్‌లో ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆ రాష్ట్ర సీఎం అఖిలేశ్‌యాదవ్ సహా తొమ్మిది మందిని నామినేట్ చేశారు.
వారణాసి నియోజకవర్గంలో రెండు రోజుల సుడిగాలి పర్యటనలో భాగంగా శనివారం మోదీ ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని చేపట్టారు. వారణాసిలో గంగాతీరాన ఉన్న పురాతన ఘాట్ అయిన అస్సీ ఘాట్‌లో దాదాపు 15 నిమిషాల పాటు పారతో తవ్వి, పూడిక తీశారు. అనంతరం మోదీ అక్కడే విలేకరులతో మాట్లాడారు. ‘‘గంగా తీరంలోని ఘాట్ల వద్ద పేరుకుపోయిన చెత్తను, పూడికను తొలగించే కార్యక్రమంలో కాశీ ప్రజలను భాగస్వాములను చేసేందుకు ఇక్కడకు వచ్చాను.
నెల రోజుల్లో ఘాట్లన్నింటినీ పరిశుభ్రంగా మారుస్తామని ఇక్కడి సంస్థలు నాకు చెప్పాయి. ఆ మాటలు కార్యరూపం దాల్చుతాయని భావిస్తున్నా..’’ అని పేర్కొన్నారు. అనంతరం యూపీలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం వివిధ రంగాలకు చెందిన తొమ్మిది మంది ప్రముఖులను దీనిలో పాల్గొనాల్సిందిగా మోదీ ఆహ్వానించారు. వారిలో యూపీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌తో పాటు క్రికెటర్లు సురేశ్ రైనా, మహమ్మద్ కైఫ్, ఎంపీ మనోజ్ తివారీ, సూఫీ గాయకుడు కైలాష్ ఖేర్, హాస్యనటుడు రాజు శ్రీవాత్సవ, అంధులకోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన స్వామి రాంభద్రాచార్య, సంస్కృత పండితుడు దేవీప్రసాద్ ద్వివేదీ, రచయిత మను శర్మ ఉన్నారు. తర్వాత మోదీ గంగానది వద్ద ప్రత్యేక పూజలు చేసి, సమీపంలోని శ్రీ ఆనందమయి మాత ఆశ్రమాన్ని సందర్శించారు. అనంతరం ఢిల్లీకి బయలుదేరారు.
వారణాసిలో బ్యాటరీ కార్లు..
పవిత్రతను, సంప్రదాయ వాతావరణాన్ని పరిరక్షిస్తూనే కాశీ నగరాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దుతామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వారణాసి పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం రాత్రి అక్కడి ప్రముఖులు, మేధావులు, నిపుణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారణాసిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే అంశంపై పలు ప్రతిపాదనలను వెల్లడించారు. వారణాసిలో ప్రజారవాణాకు బ్యాటరీ (విద్యుత్)తో నడిచే కార్లను ప్రవేశపెడతామని, ప్రతి ఇంటికి వెళ్లి చెత్తను సేకరించే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు.
స్పందించని అఖిలేశ్..: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వారణాసిలో ప్రధాని మోదీ నామినేట్ చేసినవారిలో క్రికెటర్ సురేశ్‌రైనాతో పాటు మరికొందరు సానుకూలంగా స్పందించగా.. యూపీ సీఎం అఖిలేశ్ మాత్రం స్పందించలేదు.
ఆ దృశ్యాలు కళ్ల ముందు కదలాడాయి..
తన రెండు రోజుల పర్యటనలో భాగంగా మోదీ వారణాసిలోని డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ (డీఎల్‌డబ్ల్యూ)లో గడిపారు. ఈ సందర్భంగా సందర్శకుల పుస్తకంలో తన భావాల ను రాశారు. ‘‘చిన్నప్పటి నుంచి నాకు రైల్వే తో, రైల్వే స్టేషన్లు, బోగీలతో నాకు బంధం ఉంది. నిన్నటి నుంచి ఇక్కడే ఉన్న నాకు ఇక్కడి రైల్వేల వాతావరణం నా చిన్నతనాన్ని గుర్తుచేసింది. నాటి రైలు బోగీలు, ప్రయాణికులు ఇలా ఆ దృశ్యాలన్నీ కళ్ల ముందు కదలాడాయి. ఇవి ఉద్వేగభరిత జ్ఞాపకాలు. డీఎల్‌డబ్ల్యూ సిబ్బందికి నా కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.