సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేలా మేడిన్ ఇండియా ఉత్పత్తులను తయారు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ దిశగా స్వయం సమృద్ధి దిశగా చర్యలు కీలకమని చెప్పారు. బలమైన ఆకాంక్ష, సమ్మిళిత వృద్ధి, పెట్టుబడులు, మౌలిక వసతులు, వినూత్న ఆలోచనలు వంటి పంచ సూత్రాలు స్వయం సమృద్ధికి అవసరమని చెప్పారు. భారత పరిశ్రమలు, మన సామర్ధ్యం, సాంకేతికత పట్ల సర్వత్రా విశ్వాసం ఉందని అన్నారు. కోవిడ్-19 బారి నుంచి ప్రజలను కాపాడుకుంటూ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలోకి తేవడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ మంగళవారం సీఐఐ 125వ వార్షికోత్సవాలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
లాక్‌డౌన్ నుంచి మనం అన్‌లాక్ మోడ్‌లోకి వచ్చామని అన్నారు. ముందస్తు లాక్‌డౌన్‌తో మనం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఎంఎస్‌ఎంఈలు నిలదొక్కుకునేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆత్మనిర్భర్ ప్యాకేజ్‌తో దీర్ఘకాల వృద్ధికి బాటలు పరిచామన్నారు. ఉపాథి అవకాశాలు పెంచేందుకు సంస్కరణలు అవసరమని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సత్వరం కోలుకునేలా చూడాలని ఆర్థిక వ్యవస్థ బలోపేతమే తమ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు కఠిన చర్యలు అవసరమని అన్నారు. ఇక వ్యవసాయ ఉత్పత్తులకు ఈ ట్రేడింగ్ విధానం ప్రవేశపెడతామని, రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వినూత్న ఆలోచనలతో అన్ని రంగాల్లో వృద్ధి సాధ్యమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment