సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో అనేక రకాల మూక హత్యలు జరుగుతున్నా, మతపరమైన హత్యలనే ఎక్కువ ప్రచారం చేస్తున్నారని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యానించారు. ఉత్తర భారత దేశంలో గోమాంసం పేరిట జరిగిన హత్యలకు మీడియా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి.. ఇతర కారణాలతో జరిగే మూక హత్యలపై మౌనం వహిస్తోందని ఆరోపించారు. నకిలీ వార్తల వ్యాప్తితో.. చిన్న పిల్లలను ఎత్తుకెళ్తున్నారనే పుకార్లను నమ్మి ప్రజలు అనుమానితులను హత్య చేసిన ఘటనలు యూపీఏ హయాంలో జరిగాయని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు 2012లో 16, 2013లో 14 జరిగాయనీ.. వీటిపై ఏ మీడియా సంస్థ కూడా డిబేట్ పెట్టలేదని విమర్శించారు.
‘నకిలీ వార్తల కారణంగా మూక హత్యలు జరిగినప్పుడు స్థానికంగా అప్పటికప్పుడు హడావుడి చేస్తారు. ఆతర్వాత మరచిపోతారు. కానీ ప్రజల చేతిలో హతమైన వారి గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరు’అని మంత్రి అన్నారు. ఇలాంటి హత్యలను గుర్తించి టీవీలలో చర్చించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలని ఆయన మీడియాకు సూచించారు. కాగా, గతేడాది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పుకార్లు వ్యాపించిన సంగతి తెలిసిందే. దీని వల్ల చాలా మంది బిచ్చగాళ్లు, వేరే రాష్ట్రాల వారు ప్రజల చేతిలో దాడికి గురయ్యారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment