
న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో లాక్‌డౌన్ ప్రకటించడం సరైన నిర్ణయేమనని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. అయితే మహమ్మారి విజృంభణ నేపథ్యంలో 21 రోజుల లాక్‌డౌన్ పొడగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత్ సరైన విధంగా సన్నద్ధం కాలేదని.. అందుకే భారీ మూల్యం చెల్లించాల్సివస్తోందని విమర్శించారు. మున్ముందు మరింత కఠిన రోజులు చూడాల్సివస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
కాగా ప్రాణాంతక వైరస్ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి నుంచి 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలంతా ఇంట్లోనే ఉండి.. మహమ్మారిని కట్టడి చేసేందుకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇక కరోనా ధాటికి భారత్‌లో ఇప్పటికే 11 మరణాలు సంభవించగా... 519 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.