లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లో శాంతి భద్రతల అంశంపై స్పందిస్తూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. శనివారం ప్రియాంక ట్విటర్ వేదికగా స్పందిస్తూ..‘రాష్ట్రంలో నేరగాళ్లు ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. యూపీ ప్రభుత్వం నేరగాళ్లకు లొంగిపోయిందా అనే అంశాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను’ అంటూ ప్రియాంక ట్వీట్ చేశారు. యూపీలో మహిళల మీద వేధింపులు, అత్యాచారాలు, నేరాలు రోజూవారి దినచర్యలో భాగమని ప్రియాంక విమర్శించింది. ప్రజలు ఆటవిక రాజ్యంలో మగ్గిపోతున్నారని మండిపడింది.
అయితే ప్రియాంక ట్వీట్‌పై యూపీ పోలీసులు వెంటనే స్పందించారు. నేరగాళ్ల మీద తీసుకున్న చర్యలకు సంబంధించిన డేటా ఆధారంగా ఆమెకు సమాధానమిస్తూ ట్వీట్ చేశారు. తీవ్రమైన నేరాలకు సంబంధించి ఈ రెండు సంవత్సరాల్లో 9,225 నేరగాళ్లను అరెస్టు చేశామని, 81 మందిని ఎన్‌కౌంటర్ చేశామని వెల్లడించారు. సంచలనం సృష్టించిన కేసులను కేవలం 48 గంటల్లోపే పరిష్కరించామన్నారు. దోపిడీ, హత్యలు, కిడ్నాపులు వంటి నేరాలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. రాష్ట్రంలో నేరాల రేటు 20-30 శాతం తగ్గిందని, పోలీసుల పహారా, నేరస్థుల పట్ల కఠిన చర్యల ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నామని పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment