
పూణే : ఎండ వేడికి తట్టుకోలేక ఓ ఐదేళ్ల చిన్నారి పార్క్ చేసి ఉన్న కారులోకి వెళ్లాడు. ఆ కారే ఆ పసివాడిని మింగేసింది. పోలీసుల వివరాల ప్రకారం కరణ్ పాండే (5) మధ్యాహ్నం పూట తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. వేడికి తట్టుకోలేక అక్కడే పార్కు చేసి ఉన్న కారు ఎక్కాడు. అది కాస్తా లాక్ అవడంతో కరణ్ లోపలే ఉండిపోయాడు. లోపల వేడి తట్టుకోలేక బయటకు రావడానికి ప్రయత్నించాడు. కానీ కార్ లాక్ అవడం వల్ల బయటకు రాలేకపోయాడు.
దీంతో కారు లోపల ఊపిరాడక మరణించాడు. అయితే ఎంతసేపయిన కరణ్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. సుమారు ఆరు గంటలపాటు వెతికిన తరువాత కారులో కరణ్ మృతదేహాన్ని కనుగొన్నారు. కరణ్ తల, మెడ, ముఖం మీద కాలిన గాయాలు ఉన్నాయి. ఈ గాయాలు కారు లోపలి వేడి వల్ల ఏర్పడి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు యజమాని వివరాలను మాత్రం వెల్లడించలేదు.