కక్కించే వరకూ నిద్రపోను
దోపిడీతో ప్రజల భవిష్యత్‌ను నాశనం చేసిన వారికి బుద్ధి చెప్పండి
► సర్జికల్ దాడులను ప్రశ్నించడమంటే.. సైన్యాన్ని అవమానించడమే..
► ఉత్తరాఖండ్ ప్రచారంలో కాంగ్రెస్‌పై మండిపడ్డ ప్రధాని మోదీ
శ్రీనగర్/పితోరాగఢ్: దేశాన్ని దోచుకున్న వారి నుంచి వారు దోచుకున్న మొత్తం కక్కించే వరకూ తాను నిద్రపోనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ప్రజల భవిష్యత్తును నాశనం చేసిన వారికి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. సర్జికల్ దాడులను కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడమంటే దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన సైనిక దళాలను కించపరచడమే అని మండిపడ్డారు.
సర్జికల్ దాడులు మిలిటరీ చరిత్రలోనే గొప్ప సంఘటన అని, దీనిపై ప్రపంచంలోని వివిధ మిలిటరీ ఏజెన్సీలు అధ్యయనం చేస్తున్నాయని చెప్పారు. రాజకీయాలు చేయాలనుకుంటే.. మోదీపై దాడి చేయాలనుకుంటే చేసుకోండి కానీ.. దేశం కోసం త్యాగాలు చేసిన మిలిటరీ, సైనికుల పరాక్రమంపై అనుమానాలు వ్యక్తం చేయడం తగదని హితవు పలికారు. ‘‘70 ఏళ్ల పాటు దేశాన్ని దోపిడీ చేసిన వారి టైమ్ ఇప్పుడు ఆఖరికి వచ్చింది. దేశాన్ని దోపిడీ చేసిన దానిని తిరిగి చెల్లించేలా చేస్తానని హామీ ఇస్తున్నా. ఈ పని పూర్తయ్యే వరకూ నేను నిద్రపోను. దోపిడీదారులను ప్రశాంతంగా నిద్రపోనివ్వను’’ అని మోదీ పేర్కొన్నారు.
కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి...
దేవభూమి ప్రతిష్టను దెబ్బతీసి దోపిడీ భూమిగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీతో చేతులు కలిపి ప్రజలపై ఆకృత్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తమ భవిష్యత్తును దెబ్బ తీసిన వారికి ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పి.. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలేవీ అక్రమాలకు పాల్పడకుండా గట్టి హెచ్చరికలు పంపాలని కోరారు. 40 ఏళ్ల పాటు ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ అంశంపై మొద్దునిద్రపోయి.. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమను ప్రశ్నిస్తోందని ఎద్దేవా చేశారు. రూ.12,500 కోట్లు వ్యయమయ్యే ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ పథకానికి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయిస్తే.. తమ ప్రభుత్వం ఇప్పటికే రూ.6,500 కోట్లను సైనికులకు చెల్లించిందని గుర్తుచేశారు.
3 నెలల పర్యటనల వివరాలు కోరిన మోదీ
న్యూఢిల్లీ: గత మూడు నెలల్లో జరిపిన పర్యటనల వివరాలు ఇవ్వాలని సహచర మంత్రుల్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఇటీవల కేబినెట్ సమావేశంలో సోమవారంలోపు నివేదిక ఇవ్వాలని మంత్రులకు ప్రధాని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, పెద్ద నోట్ల రద్దుపై మంత్రులు ఏ మేరకు ప్రచారం చేశారో తెలుసుకునేందుకే ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మంత్రులు ఒక వేళ ఎలాంటి పర్యటనలు చేయకుంటే ఢిల్లీలో కార్యాలయానికి హాజరైనట్లు నివేదిక ఇవ్వాలని కోరినట్లు సమాచారం. పెద్ద నోట్ల రద్దుకు అనుకూలంగా నియోజకవర్గాల్లో మంత్రులు ఏ మేరకు ప్రచారం చేశారో తెలుసుకునేందుకు, క్షేత్రస్థాయి విధుల నిర్వహణసమాచారం తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని పీఎంఓ వర్గాలు చెబుతున్నాయి.