
ముంబైలో ఆగిన రైళ్లు..రెచ్చిపోయిన ప్రయాణికులు
ముంబై: ముంబైలో శుక్రవారం ఉదయం సాంకేతిక సమస్య కారణంగా సబర్బన్ రైలు సర్వీసులకు తీవ్ర ఆటంకం కలిగింది. వేలాదిమంది ప్రయాణికులు ఆగ్రహావేశాలతో విధ్వంసానికి దిగారు. పట్టాలపైకి దూసుకెళ్లి పోలీసులపై రాళ్లు రువ్వి, టికెట్ బుకింగ్ కౌంటర్లు తదితర రైల్వే ఆస్తులకు నష్టం కలిగించారు. కొన్ని వాహనాలకు నిప్పుపెట్టారు.
ఆరు గంటల పాటు వారికి, పోలీసులకు మధ్య ఘర్షణ సాగింది. థానే జిల్లాలోని థాకుర్లీ, దోంబివిలీ మధ్య ఓ లోకల్ రైలు విద్యుత్ వైరు తెగిపోవడంతో పలు స్టేషన్లలో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగింది. తొలుత దివా స్టేషన్‌లో ప్రయాణికులు రైల్వే సిబ్బందితో గొడవపడ్డారు. తర్వాత దక్షిణ ముంబైలోని స్టేషన్లలో నిరసనలు పెల్లుబికాయి.
ప్రయాణికులు రాళ్లు విసరడంతో కల్యాణ్-సీఎస్‌టీ స్టేషన్‌లో రైలు డ్రైవర్ గాయపడ్డారు. దీంతో డ్రైవర్లు మెరుపు సమ్మెకు దిగారు. అయితే వారికి పోలీసు రక్షణ కల్పిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. దీంతో రైళ్లు యథావిధిగా నడిచాయి. ఈ అంశంపై రైల్వే మంత్రి సురేశ్ ప్రభు అధికారులతో మాట్లాడారు. ప్రయాణికులను సంయమనం పాటించాలని కోరారు.