న్యూఢిల్లీ: డిమాండ్‌కు అనుగుణంగా టికెట్ ధరలు పెంచే డైనమిక్ విధానంలో భాగంగా దీపావళి, దుర్గాపూజ, క్రిస్మస్ వంటి పండుగలతో పాటు వారాంతాల్లో టికెట్ ధరల్ని 10–20 శాతం పెంచాలని రైల్వేశాఖకు ప్రతిపాదనలు అందాయి. తెల్లవారుజాము 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఖాళీ బెర్తులున్న రైళ్లలో టికెట్ ధరలపై 10–30 శాతం రాయితీ ఇవ్వాలని తూర్పు, పశ్చిమ, పశ్చిమ మధ్య రైల్వేజోన్లు సిఫార్సు చేశాయి.
ఒకే మార్గంలో వెళ్లే సాధారణ రైళ్లతో పోలిస్తే హైస్పీడ్ రైళ్లలో ప్రయాణికుల నుంచి అధికంగా గంటకు ఇంత అని వసూలుచేయాలని జోన్లు ఇందులో ప్రతిపాదించాయి. వీటితో పాటు రాత్రిపూట ప్రయాణించే, పాంట్రీకారు సౌకర్యమున్న రైళ్లలో కూడా ప్రీమియం చార్జీలు వసూలు చేయాలని రైల్వేజోన్లు సిఫార్సుచేశాయి. ప్రయాణికులు ప్రాధాన్యం ఇచ్చే దిగువ బెర్తులు, తలుపుకు దగ్గరగా ఉండే కేబిన్లకు కూడా అధిక చార్జీలు వసూలు చేయనున్నారు. దీంతో పాటు ఒక్కో బెర్త్‌కు అప్‌గ్రెడేషన్ చార్జీల కింద రూ.20 వసూలుచేయాలని ప్రతిపాదించాయి. ప్రీమియం చార్జీలు, రాయితీలపై డిసెంబర్ 31 కల్లా తుదినిర్ణయం తీసుకుంటామని రైల్వే ఉన్నతాధికారి తెలిపారు.
213 రైల్వే ప్రాజెక్టుల్లో పెరిగిన వ్యయం:
భారత రైల్వే అమలుచేస్తున్న 353 ప్రాజెక్టుల్లో 213 ప్రాజెక్టుల(60శాతం) అంచనా వ్యయం పలు కారణాలతో పెరిగిపోయిందని కేంద్రం తెలిపింది. 2017 సెప్టెంబర్‌లో ఈ 213 ప్రాజెక్టుల్లో అంచనా వ్యయం రూ.1.61 లక్షల కోట్లు పెరిగిందని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ వెల్లడించింది. తొలుత ఈ ప్రాజెక్టుల వాస్తవ వ్యయం రూ.1.21 లక్షల కోట్లుగా నిర్ణయించగా.. వివిధ కారణాలతో రూ.2.83 లక్షల కోట్లకు చేరుకుందని పేర్కొంది.
‘త్రినేత్ర’తో చెక్!
సాక్షి, న్యూఢిల్లీ: రైలు ప్రమాదాల నివారణకు రైల్వేశాఖ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా దూరంగా ఉండే ట్రాక్ పరిస్థితిని తెలుసుకునేలా ‘త్రినేత్ర’ అనే ప్రత్యేక వ్యవస్థను త్వరలో రైళ్లలో అమర్చనుంది. ఇన్‌ఫ్రారెడ్, లేజర్ కిరణాలతో పనిచేసే త్రినేత్ర.. దూరంగా ఉండే ట్రాక్‌లో లోపాల్ని, దానిపై అడ్డంకుల సమాచారాన్ని ముందుగానే లోకోపైలెట్‌కు చేరవేస్తుంది. ట్రాక్ స్థితిగతుల్ని లోకోపైలెట్ తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేక డిస్‌ప్లే ఏర్పాటుచేయనున్నారు. ఈ పరిజ్ఞానం ద్వారా ఉత్తరాది రాష్ట్రాల్లో రైళ్లకు తీవ్ర ఇబ్బందిగా మారిన మంచు సమస్యను అధిగమించవచ్చని రైల్వే ఉన్నతాధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment