జైసల్మేర్ జిల్లాలో లభించిన శిలాజాలు
జైపూర్ : ఎడారి.. కనుచూపు మేర ఇసుక తప్ప మరొకటి కనిపించని ప్రాంతం. మచ్చుకోక చోట మాత్రమే నీరు. మన దేశంలో ఎడారి అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు రాజస్ధాన్. అయితే ఇప్పటి ఈ ఎడారి ప్రాంతం ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసా..? పూర్తిగా నీరు ఆవరించి ఉండేది. చెలమలు, చెరువుల కాదు.. ఏకంగా సముద్రం. అవును ఇప్పటి ఈ ఎడారి ప్రాంతంలో ఒకప్పుడు సముద్రం ఉండేదంట. నమ్మడానికి కాస్తా ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక ఏడాది నుంచి గుజరాత్, రాజస్థాన్‌లో విస్తరించిన ఎడారి ప్రాంతంలో పరిశోధనలు నిర్వహిస్తుంది. పాలియెంటాలజీ(శిలాజాల అధ్యాయనం) విభాగం డైరెక్టర్ దేబసిష్ భట్టాచార్య అధ్వర్యంలో నిర్వహస్తున్న ఈ పరిశోధనలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. జైసల్మేర్ జిల్లాలోని ఈ ఎడారి ప్రాంతంలో పూర్వ చారిత్రక యుగానికి సంబంధించిన అనేక శిలాజాలు బయటపడ్డాయి. వీటిలో తొలి తరం తిమింగలానికి సంబంధించినవి, షార్క్, మొసలి దంతాలు, తాబేలు ఎముకకు సంబంధించిన శిలజాలు ఉన్నాయి. ఇవన్ని పూర్వ చారిత్రక యుగానికి సంబంధించినవే కాక మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఇవన్ని జలచరాలు. ఇవన్ని మధ్య శిలాయుగానికి చెందినవి.
జైసల్మేర్ జిల్లాలో దొరికిన ఈ శిలజాలు అన్ని మధ్య శిలా యుగానికి చెందినవిగా భట్టాచార్య టీం గుర్తించింది. మధ్య శిలా యుగం అంటే దాదాపు 47 లక్షల సంవత్సరాల కాలం నాటి జీవజాలం. అంటే ప్రస్తుతం ఎడారి విస్తరించిన ఈ ప్రాంతంలో కొన్ని లక్షల ఏళ్ల క్రితం సముద్రం ఉండేదని స్పష్టంగా అర్ధమవుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. కాల క్రమేణ వచ్చిన వాతావరణ మార్పులు మూలంగా ప్రస్తుతం ఉన్న ఎడారిగా రూపాంతరం చెంది ఉంటుందని శ్రాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
అంతేకాక గుజరాత్, కచ్ బేసిన్ ప్రాంతాల్లో ఒకే రకమైన వాతావరణ మార్పులు సంభవించి ఉంటాయని భట్టాచార్య టీం అంచనా వేస్తుంది. అయితే ఒకప్పుడు ఉన్న సముద్రం అంతరించి ఇప్పటి ఎడారి ఏర్పడటానికి దారి తీసిన పరిస్థితుల గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత పరిశోధన చేయాల్సి ఉంటుందని భట్టాచార్య ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment