రేపు కోర్టుకు రాంపాల్
ఆశ్రమం నిండా భారీ స్థాయిలో ఆయుధాలు, వంద కోట్లకు పైగా ఆధ్యాత్మిక సామ్రాజ్యం కలిగిన వివాదాస్పద బాబా రాంపాల్ను పంజాబ్ హర్యానా హైకోర్టులో శుక్రవారం ప్రవేశపెడుతున్నారు. ఇందుకోసం చండీగఢ్లోని కోర్టు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 2006లో జరిగిన ఓ హత్యకేసులో రాంపాల్కు గతంలో మంజూరైన బెయిల్ను హైకోర్టు రద్దుచేసింది. నవంబర్ 28న కోర్టులో రాంపాల్ను ప్రవేశపెట్టాలని హర్యానా పోలీసులను ఆదేశించింది.
హర్యానాలోని హిస్సార్ జిల్లా బల్వారాలో గల రాంపాల్ ఆశ్రమంపై జరిగిన పోలీసు చర్య, ఏయే వర్గాల నుంచి ఎంతమంది గాయపడ్డారనే వివరాలతో కూడిన నివేదికను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని హర్యానా డీజీపీని కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను జస్టిస్ ఎం.జయపాల్, జస్టిస్ దర్శన్ సింగ్లతో కూడిన ధర్మాసనం 28కి వాయిదా వేసింది. ఆశ్రమంలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఎంత నష్టం జరిగిందో కూడా తెలియజేయాలంది. ఇంతకుముందు మూడుసార్లు కూడా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించినా, ఆరోగ్యం బాగోలేదనే వంకతో రాంపాల్ వాయిదా వేస్తూ వచ్చారు.