
సాక్షి, న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లో స్థిరపడిన ఇతర ప్రాంతాలకు చెందిన ఆరు ఆదివాసీ జాతుల వారికి శాశ్వత నివాస పత్రాలు జారీ చేయాలంటూ ఉన్నతాధికార కమిటీ చేసిన సిఫార్సుకు వ్యతిరేకంగా ఆరుణాచల్ ప్రదేశ్ ఆదివాసీలు గత శుక్రవారం నుంచి చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారడం, ఆందోళనను అరికట్టేందుకు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించడం తెల్సిందే. దీనిపై స్పందించిన 24 ఏళ్ల యువ సంగీత దర్శకుడు, ర్యాప్ సింగర్ కెఖో తియామ్‌ఖో శనివారం నాడు ర్యాప్ శైలిలో ఓ పాట రాసి దానికి బాణి కూర్చి పాడారు. ఆ పాట ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాజకీయ నేతలు తమను అన్యాయం చేస్తున్నారని, ఆ అన్యాయానికి వ్యతిరేకంగా ఎండయినా, వానయినా లెక్క చేయకుండా కలిసి కట్టుగా పోరాడతామంటూ ఆయన పాట సాగుతుంది. యూనిఫామ్ ధరించిన భద్రతా బలగాలు తలకెక్కిన ఉన్మాదంతో సొంత ప్రజలనే చంపుతున్నారన్న ఆ వేదన కూడా హృద్యంగా వినిపిస్తుంది. ‘సేవ్ అరుణాచల్’ పేరిట ఈ పాట విడుదలయింది. మూడు రోజుల ప్రజల ఆందోళనకు భయపడి పోయిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సిఫార్సును ప్రస్తుతం అమలు చేయకుండా నిలిపి వేయాలని నిర్ణయించింది.