రతన్ టాటాకు మతి తప్పిందా?
విరుచుకుపడిన బెంగాల్ సర్కారు
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి లేదన్న వ్యాఖ్యలపై ఎద్దేవా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో పారిశ్రామిక కార్యకలాపాలు చెప్పుకోదగినట్టుగా లేవని టాటా గ్రూప్ మాజీ చీఫ్ రతన్ టాటా చేసిన వ్యాఖ్యలపట్ల పశ్చిమబెంగాల్ పాలకపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ గురువారం తీవ్రంగా ప్రతిస్పందించింది. రతన్ టాటాకు మతిభ్రమించిట్టు కనిపిస్తోందంటూ తృణమూల్ పార్టీనేత, పశ్చిమబెంగాల్ ఆర్థిక, పరిశ్రమల శాఖల మంత్రి అమిత్ మిత్రా మీడియా ముందు వ్యాఖ్యానించారు. రత న్ టాటా మతితప్పి మాట్లాడుతున్నారని, ఆయన ఇక, విమానాల్లో ప్రయాణించే తన హాబీని కొనసాగిస్తే బాగుంటుందని సూచించారు.
పశ్చిమ బెంగాల్ పట్టణాభివృద్ది మంత్రి ఫర్హాద్,. హకీమ్ మరింతగా విరుచుకుపడ్డారు. టాటా సంస్థల చైర్మన్‌గా బాధ్యతలనుంచి తప్పుకున్న తర్వాత రతన్ టాటాకు కచ్చితంగా మతితప్పి ఉంటుందన్నారు. పశ్చిమబెంగాల్‌లో తన గ్రూపు కంపెనీ విస్తరణ గురించే తనకు తెలియదని, బహుశా,.. తాజా పరిస్థితిని కంపెనీ అధికారులు ఆయనకు వివరించలేదోమోనని మిత్రా వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు క్యూక డుతున్నాయని, అలాంటి కంపెనీల జాబితా చదవడానికే రోజంతా సరిపోతుందని అన్నారు.