ముంబై: దేశ ఆర్ధిక రాజధానిలో గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 18 మంది రైలు యాక్సిడెంట్లలో మరణించారు. ముంబైలో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ 2 వేల మందికి పైగా రైలు యాక్సిడెంట్లలో మృతి చెందారు. వీరిలో ఎక్కువమంది రైల్వే లైన్లు క్రాస్ చేస్తుండగా మరణించడం గమనార్హం. గురువారం ఒక్కరోజే 18 మంది మరణించగా..16 మంది గాయాలపాలయ్యారు.
అత్యధికంగా వాసాయ్ జీఆర్పీ ఔట్ పోస్టు(మీరా రోడ్డు-వైతర్నాస్టేషన్ల మధ్య) వద్ద ఐదుగురు, కళ్యాణ్ జీఆర్పీ ఔట్ పోస్టు(కళ్యాణ్-కసర స్టేషన్ల మధ్య) వద్ద ముగ్గురు మరణించారు. కళ్యాణ్, దహిసర్ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ప్రజలు పశ్చిమ ముంబైలో ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. ఈ ప్రాంతాల నుంచి పశ్చిమ ముంబై చేరుకోవడానికి రైలు మార్గమే దిక్కు. దీంతో ఉద్యోగాలకు వెళ్లి, వచ్చే సమయాల్లో లైన్లు క్రాస్ చేస్తునో.. రద్దీగా ఉన్న రైల్లో నుంచి జారిపడో మరణించే వారి సంఖ్య గత కొంతకాలంగా విపరీతంగా పెరిగిపోతోంది.
దీనిపై స్పందించిన భద్రతా అధికారులు నగరంలో జనభా విపరీతంగా పెరుగుతోందని అన్నారు. కొత్త సర్వీసుల అవసరాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తోందని చెప్పారు. జనసాంద్రత పెరిగుతున్న కారణంగానే రైళ్ల సమయాల్లో మార్పులు జరిగితే అది శాంతి, భద్రతలకు సంబంధించిన విషయం అవుతుందని ఓ ఐపీఎస్ ఆఫీసర్ వాపోయారు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల మధ్య నుంచి రైళ్ల మార్గాలు ఉంటుండటంతో రోజులో కొద్దిసార్లు లైన్లు క్రాస్ చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోందని మరో అధికారి తెలిపారు. రైల్వే శాఖ ఈ మేరకు ఇప్పటికే బాంబే మునిసిపల్ కార్పొరేషన్(బీఎమ్ సీ)తో చర్చలు జరిపిందని వివరించారు. సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లైన్ల మీదుగా కొత్త బ్రిడ్జిలను నిర్మించాలని బీఎమ్ సీకి సూచించినట్లు చెప్పారు.
రైలు మార్గం.. మృత్యువుతో పోరాటం
Published Sat, Sep 3 2016 6:17 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement