ముంబై తరహా దాడికి పాక్‌ ఉగ్ర కుట్ర | Red Corner notice against Pak Diplomat Amir Zubair Siddiqui! | Sakshi
Sakshi News home page

పాక్‌ దౌత్యవేత్తపై ‘రెడ్‌ కార్నర్‌’..!

Published Tue, Apr 10 2018 10:42 AM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

Red Corner notice against Pak Diplomat Amir Zubair Siddiqui! - Sakshi

జాతీయ దర్యాప్తు  సంస్థ(నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ – ఎన్‌ఐఏ) మొట్టమొదటి సారిగా అమిర్‌ జుబేర్‌ సిద్ధిఖీ అనే పాకిస్థానీ దౌత్యవేత్త పేరును ‘మోస్ట్‌ వాంటెడ్‌ లిస్ట్‌’లో చేర్చడంతో పాటు తొలిసారిగా పాక్‌కు చెందిన ఈ స్థాయి అధికారిపై రెడ్‌కార్నర్‌ నోటీస్‌ జారీ కోసం ఇంటర్‌పోల్‌కు విజ్ఞప్తి చేయనుంది.  పదేళ్ల క్రితం నవంబర్‌లో ముంబైలో జరిపిన ఉగ్ర మారణకాండ తరహాలో మరోసారి  భారత్‌లోని అమెరికా, ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయాలపై, దక్షిణ భారత్‌లోని ఆర్మీ, నేవీ కమాండ్‌లపై దాడికి ఈ రాయబారి  కుట్ర పన్నినట్టు ఎన్‌ఐఏ తేల్చింది.

సిద్ధిఖీ ఫోటోను కూడా విడుదల చేయడంతో పాటు అతడికి సంబంధించిన సమాచారాన్ని  తెలియజేయాల్సిందిగా కోరింది. ఈ రాయబారితో పాటు మరో ముగ్గురు పాకిస్థానీ అధికారులు కూడా ఈ కుట్ర భాగస్వాములని, వారిలో ఇద్దరి పేర్లను కూడా ఈ లిస్ట్‌లో చేర్చినట్టు పేర్కొంది. వీరిని అదుపులోకి తీసుకోవడం కోసం అంతర్జాతీయ అరెస్ట్‌ వారెంట్‌పై ‘రెడ్‌ కార్నర్‌ నోటీస్‌’ జారీకి ఇంటర్‌పోల్‌ను విజ్ఞప్తి చేసేందుకు కూడా ఎన్‌ఐఏ సిద్ధమవుతోంది.  

2008 నవంబర్‌ 26న  ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌తో పాటు తాజ్, ట్రైడెండ్‌  హోటల్, తదితర ప్రాంతాల్లో పాక్‌ ప్రేరేపిత  లష్కరే తయ్యిబా ఉగ్రవాదులు బాంబులు, అధునాతన తుపాకులతో  దాడి చేసి నాలుగు రోజుల పాటు  మారణహోమాన్ని సృష్టించి 166 మంది (9 మంది ఉగ్రవాదులతో సహా)ని పైగా పొట్టనబెట్టుకున్నారు. ప్రాణాలతో దొరికిన  అజ్మల్‌ కసబ్‌ అనే ఉగ్రవాదిని ఆ తర్వాత కోర్టులో విచారించి ఉరి తీసిన విషయం తెలిసిందే.

గత ఫిబ్రవరిలోనే సిద్ధిఖీ, మరో ముగ్గురు అధికారులపై ఎన్‌ఐఏ చార్జిషీటు దాఖలు చేసినా వారిని గుర్తించడం సాధ్యం కాలేదు. అదేనెలలో వివిధ సెక్షన్లపై  సిద్ధిఖీతో పాటు బాలసుబ్రహ్మణ్యం, నూరుద్దీన్‌లపై అదనపు చార్జిషీటు కూడా దాఖలు చేసింది.  వీరిలో సిద్ధిఖీ శ్రీలంక కోలంబోలోని  పాక్‌ హైకమిషన్‌ కార్యాలయంలో వీసా కౌన్సెలర్‌గా పనిచేశారు. ఇక మిగతా వారి విషయానికొస్తే... ‘వినీత్‌’ అనే మారుపేరుతో చెలామణి అవుతున్న  పాక్‌ నిఘాసంస్థ అధికారితో పాటు బోస్‌ అలియాస్‌ షా అనే కోడ్‌నేమ్‌ కలిగిన అధికారి ఇంకా శ్రీలంకలోని పాక్‌ హైకమిషన్‌ అధికారి కూడా ఈ కుట్రలో భాగస్వామి అని ఎన్‌ఐఏ స్పష్టంచేసింది.

కుట్ర ఎప్పుడు... ఎలా... ఎక్కడ ?
2009–2016  మధ్యకాలంలో   ఈ అధికారులంతా కొలంబోలో పనిచేస్తున్న సందర్భంగా తమ ఏజెంట్ల ద్వారా దక్షిణ భారత్‌లోని చెన్నై, తదితర ప్రాంతాల్లోని కీలక సైనిక స్థావరాలపై దాడులకు కుట్రపన్నారు.  2014లోనే  దేశంలోని అమెరికా, ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయాలతో పాటు, దక్షిణాదిలోని ఆర్మీ,నేవి స్థావరాలపై ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్టుగా ఎన్‌ఐఏ నిర్థారించింది. దీని కోసం సిద్ధిఖీ శ్రీలంక పౌరుడు   మహ్మద్‌ సాకిర్‌ హుస్సేన్‌తో పాటు అరుణ్‌ సెల్వరాజ్, శివబాలన్, తమీమ్‌ అన్సారీలను రిక్రూట్‌ చేశారు. భారత్‌లో దాడులు చేయాలనుకుంటున్న రక్షణ సంస్థలు, అణు స్థావరాలు, ఆయుధాల తరలింపునకు సంబంధించిన ఫోటోలు తీయాల్సిందిగా ఈ ఏజెంట్లను  సిద్ధిఖీ, ఇతర అధికారులు పురమాయించారు.

ఆర్మీ అధికారుల లాప్‌టాప్‌లు దొంగిలించడంతో పాటు విçస్తృతంగా భారత నకిలీ కరెన్సీ చెలామణిలోకి తేవాలని వారికి సూచించారు. చెన్నైలోని  అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం, బెంగళూరులోని ఇజ్రాయెల్‌ కాన్సులేట్, విశాఖపట్టణంలోని ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్, దేశంలోని వివిధ నౌకాశ్రయాలపై దాడులకు ప్రణాళికలు రచించినట్లు ఎన్‌ఐఏ భావిస్తోంది.  వీరందరినీ కూడా ఆ తర్వాత మనదేశ దర్యాప్తు, భద్రతా సంస్థలు అరెస్ట్‌ చేశాయి. ఇలాంటి భారీ కుట్రకు సంబంధించిన కీలకసమాచారాన్ని భారత్‌తో అమెరికా పంచుకుంది. దీంతో ఈ పాకిస్థానీ అధికారుల అక్రమ కార్యకలాపాలను  మన దర్యాప్తు అధికారులు గుర్తించే వీలు ఏర్పడింది.

చెన్నై దాడికి  కోడ్‌నేమ్‌ ‘వెడ్డింగ్‌ హాల్‌...
చెన్నైలోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయంపై  పాల్పడాలనుకుంటున్న  దాడికి ‘వెడ్డింగ్‌ హాల్‌’ గా, దానిని చేపట్టే వారికి వంటవాళ్లు (కుక్స్‌)గా కోడ్‌నేమ్‌ పెట్టారు. ఈ కార్యాలయంలో పెట్టే బాంబులకు ‘మసాలాలు’ (స్పైస్‌) అనే కోడ్‌నేమ్‌ ఫైనల్‌  చేశారు. ఈ కోడ్‌నేమ్‌లతో ఉగ్రవాదులు మాల్దీవుల మీదుగా భారత్‌లోకి ప్రవేశిస్తారు. ఈ దాడులకు సంబంధించిన ప్రణాళికలపై పాకిస్థాన్‌ అధికారులతో తాను జరిపిన అంతర్గత సమావేశాల పూర్తి  వివరాలను శ్రీలంక ఏజెంట్‌ హుస్సేన్‌ దర్యాప్తు అధికారులకు వెల్లడించాడు.

అంతేకాకుండా భారత్‌లో దాడులకు పాల్పడే ఇద్దరు ఆత్మార్పణ దళ సభ్యుల (ఫిదాయిన్లు) ను తాను బ్యాంకాక్‌ లో కలుసుకున్నట్టు తెలియజేశాడు.  దాడులకు పాల్పడే ప్రదేశాల ఫోటోలను సిద్ధిఖీకి  హుస్సేన్‌ అందించినట్లు ఎన్‌ఐఏ చెబుతోంది.  2014లో హుస్సేన్‌ అరెస్ట్‌తోనే  భారత్‌లో దాడులకు పాక్‌ ప్రణాళిక  బట్టబయలైంది.  అతడిని ఎన్‌ఐఏ విచారించిన సందర్భంగానే సిద్ధిఖీ పేరు బయటకు వచ్చింది. అమెరికా అందించిన ‘డిజిటల్‌ సాక్ష్యాల’తో సిద్ధిఖీ ప్రమేయాన్ని ఎన్‌ఐఏ నిర్థారించింది. శ్రీలంకపై భారత్‌ ఒత్తిడి పెంచడంతో సిద్ధిఖీని పాకిస్థాన్‌కు తిప్పి పంపించారు.


–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement