రిజర్వు బ్యాంకు బంపర్ ఆఫర్
రిజర్వు బ్యాంకు బంపర్ ఆఫర్
Published Mon, Nov 21 2016 6:34 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
అప్పులు చేసినవాళ్లు తిరిగి చెల్లించడానికి చేతిలో నగదు లేకపోవడంతో.. రిజర్వు బ్యాంకు వారికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. కోటి రూపాయల వరకు తీసుకున్న గృహరుణం, కారు రుణం, పంట రుణాలు.. ఇతర రుణాలను చెల్లించడానికి మరో 60 రోజుల అదనపు గడువు ఇచ్చింది. నవంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు చెల్లించాల్సిన అన్ని రకాల రుణాలకు ఇది వర్తిస్తుందని రిజర్వు బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. కోటి రూపాయల లోపు వర్కింగ్ క్యాపిటల్‌గా తీసుకున్న సంస్థలకు సైతం ఇది వర్తిస్తుంది. వ్యక్తిగతంగా గానీ, వ్యాపారపరంగా గానీ తీసుకున్న రుణం కోటి రూపాయలు అంతకంటే తక్కువ అయి ఉండాలి. ఏ బ్యాంకులోనైనా లేదా ఎన్‌బీఎఫ్‌సీలో నైనా తీసుకున్న రుణాలకు సైతం ఇది వర్తిస్తుంది.
పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాతి నుంచి బ్యాంకులలో రద్దీ అసాధారణంగా పెరిగిపోవడంతో చెక్కుల క్లియరెన్సు లాంటి సాధారణ కార్యకలాపాలకు సైతం ఇబ్బందిగా ఉంటోంది. దానికి తోడు, వారానికి రూ. 24వేలు మాత్రమే డ్రా చేయడానికి అనుమతి ఉండటంతో.. రుణగ్రహీతలు కూడా పెద్ద మొత్తాలు తీసుకోవడానికి వీలుండటం లేదు. దాంతో పాత రుణాలు తిరిగి చెల్లించడానికి కూడా సమస్యగానే ఉంది. రిజర్వు బ్యాంకు ఇప్పుడు అదనంగా రెండు నెలల గడువు ఇవ్వడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందని గృహ రుణాల సంస్థ డీహెచ్ఎఫ్ఎల్ సీఈఓ హర్షిల్ మెహతా అన్నారు. చాలామంది మొదటివారంలోనే ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ వ్యాపారాలు చేసుకునేవాళ్లకు మొదటి వారం కాదుకదా.. ఇప్పటివరకు కూడా డబ్బులు చేతికి అందడం లేదు. ఒకవేళ ఇలా చెల్లించలేకపోయినా.. రుణగ్రహీతల క్రెడిట్ స్కోరు మీద ఏమాత్రం ప్రభావం పడబోదని మెహతా చెప్పారు.
Advertisement