
దర్యాప్తు సంస్థలకు సహకరిస్తా : వాద్రా
సాక్షి, న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యేందుకు కొద్దిగంటల ముందు తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని వాణిజ్యవేత్త, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. భారత న్యాయవ్యవస్థ పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని, దర్యాప్తు ఏజెన్సీలు, ప్రభుత్వ సంస్థల సమన్లు, నిబంధనలను పూర్తిగా అనుసరిస్తానని స్పష్టం చేశారు. మున్ముందు కూడా తాను ఇదే తీరున సహకరిస్తానని పేర్కొన్నారు.
తనపై తప్పుడు అభియోగాలను తొలగించేవరకూ తాను దర్యాప్తు ఏజెన్సీల ఎదుట హాజరవుతానని, వారికి సహకరిస్తానని చెప్పారు. తాను ఇప్పటివరకూ 11 సార్లు దర్యాప్తు సంస్థల ఎదుట హాజరయ్యానని వాద్రా ట్వీట్ చేశారు. లండన్‌లో ఆస్తులు కొనుగోలులో మనీల్యాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న వాద్రాకు ఈ కేసులో ఏప్రిల్ 1న ముందస్తు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే.