లండన్‌ ఆస్తులు..బికనీర్‌ భూములు | money laundering case Robert Vadra came for a third term in Delhi | Sakshi
Sakshi News home page

లండన్‌ ఆస్తులు..బికనీర్‌ భూములు

Published Sun, Feb 10 2019 3:49 AM | Last Updated on Sun, Feb 10 2019 5:10 AM

money laundering case Robert Vadra came for a third term in Delhi - Sakshi

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ సోదరి ప్రియాంకగాంధీ రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన తర్వాతే ఆమె భర్త రాబర్ట్‌ వాద్రాను ఈడీ విచారణకు పిలవడం రాజకీయ చర్చకు దారితీసింది. దీని వెనక కక్షసాధింపు ఉందని కాంగ్రెస్‌ ఆరోపిస్తుండగా, యూపీయే అధికారంలో ఉన్న సమయంలో ఆయనకు అనుచిత లబ్ధి చేకూరిందని బీజేపీ వాదిస్తోంది. వాద్రా మనీలాండరింగ్‌ కేసులో పెద్ద కథే ఉందని, ఈ వ్యవహారంలో ఆయనకు చాలా మంది సహకరించారని దర్యాప్తు సంస్థ ఈడీ అంటోంది. వాద్రాపై వచ్చిన ఆరోపణలు, కేసుల నేపథ్యమేంటో ఓసారి పరిశీలిస్తే.. 

అటుతిరిగి ఇటుతిరిగి వాద్రా చెంతకే.. 
బ్రిటన్‌లో ఆస్తుల కొనేందుకు వాద్రా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రస్తుతం ఈడీ విచారిస్తోంది. అందులో భాగంగానే ఆయన మూడుసార్లు ఈడీ ఆఫీసుకొచ్చారు. 2009లో లండన్‌లో 12 బ్రాన్‌స్టన్‌ స్క్వేర్‌లోని ఓ భవంతిని వాద్రా తరఫున ఆయుధ వ్యాపారి సంజయ్‌ భండారీకి చెందిన వోర్టెక్స్‌ సంస్థ 1.9 మిలియన్‌ పౌండ్లకు కొనుగోలు చేసింది. ఏడాది గడిచాక దుబాయ్‌కి చెందిన సీసీ తంపీకి అమ్మేసింది. భవన ఆధునీకరణకు రూ.65 వేల పౌండ్లు ఖర్చుచేసిన తంపీ..తాను కొనుగోలు చేసిన ధరకే బ్రిటన్‌లోని సింటక్‌ కంపెనీకి అమ్మారు.

సింటక్‌కు భండారీకి సంబంధాలున్నాయని భావిస్తున్నారు. ఇలా ఒక వ్యూహం ప్రకారం చేతులు మారిన నగదు మళ్లీ వాద్రా వద్దకే చేరిందనేది ఈడీ వాదన. భండారీ, వాద్రా మధ్య ఈ–మెయిళ్ల రాయబారం నడిచినట్లు తేలింది. వాద్రాకు బ్రిటన్‌లో బ్రాన్‌స్టన్‌ స్క్వేర్‌తో పాటు రూ.110 కోట్లకు పైబడిన 8 ఆస్తులున్నాయని ఈడీ వాదన. 2009లో యూపీఏ హయాంలో పెట్రోలియం సరఫరాకు విదేశాలతో ఒప్పందం కుదిరినప్పుడు వాద్రాకు, ఆయన అనుయాయులకు ముడుపులు ముట్టాయని, ఆ సొమ్ముతోనే వాద్రా లండన్‌లో ఆస్తులుకొన్నట్లు పేర్కొంది.   

‘స్కైలైట్‌’తో భారీ లాభాలు.. 
వాద్రా కంపెనీ స్కైలైట్‌ హాస్పిటాలిటీకి రాజస్తాన్‌లోని బికనీర్‌లో 275 బిగాల భూమి ఉంది. ఈ భూమి కొనుగోలు వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఈడీ 2015లోనే కేసువేసింది. స్కైలైట్‌ నుంచి ఓ ఉక్కు సంస్థ మార్కెట్‌ ధర కన్నా అధిక మొత్తానికి భూమిని కొన్న దానిపైనా దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసులో వాద్రా ఈ నెల 12న బికనీర్‌లో ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. స్కైలైట్‌ హాస్పిటాలిటీ హరియాణాలోని గురుగ్రామ్‌ సెక్టార్‌ 83లో 3.5 ఎకరాల భూమి కొనుగోలు చేసి దాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ హుడా సాయం తీసుకున్నట్లు ఈడీ ఆరోపించింది. తరువాత ఆ భూమిని వాణిజ్యపరంగా విక్రయించి భారీగా లాభాలు దండుకోవడంపై విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారంలో వాద్రా, హుడాపై కేసులు నమోదయ్యాయి.

మూడోసారి ఈడీ ముందుకు 
న్యూఢిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో రాబర్డ్‌ వాద్రా శనివారం మూడోసారి ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కార్యాల యానికి వచ్చారు. ఇదేకేసులో వాద్రాను నెల 6, 7 తేదీల్లోనూ ప్రశ్నించారు. శనివారం వాద్రాను ఏకంగా ఎనిమిది గంటలు విచారించిన అధికారులు ఆయన వ్యక్తిగత, వ్యాపార ఆర్థిక లావాదేవీలపై పలు ప్రశ్నలు వేశారు. తమ దర్యాప్తులో సేకరించిన కీలక పత్రాలను ఈ సందర్భంగా వారు వాద్రా ముందుంచినట్లు సమాచారం. పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్‌ భండారీతో వాద్రాకున్న సంబంధాల వివరాలు సైతం కీలక పత్రాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సోమవారం సైతం విచారణ కోసం ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా అధికారులు వాద్రాను ఆదేశించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement