మమతా బెనర్జీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బుధవారం రాజ్యసభను కుదిపేశాయి.
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలనరికి తెచ్చినవాళ్లకు రూ. 11 లక్షలు రివార్డ్ ఇస్తానని బీజేపీ యువమోర్చా నాయకుడు యోగేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజ్యసభను కుదిపేశాయి. ఓ మహిళా ముఖ్యమంత్రిపై బీజేపీ నేత నోటికొచ్చినట్టు మాట్లాడడంపై విపక్షాలు మండిపడ్డాయి. కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. పార్టీ నాయకుడు చేసిన ప్రకటనను బీజేపీ కనీసం ఖండించకపోవడంపై మహిళా ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
వివాదాస్పద వ్యాఖ్యల చేసిన యోగేష్‌పై చర్యలు తీసుకోవాలని టీఎంసీ డిమాండ్ చేశారు ఈ అంశంపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో... సభలో కాసేపు గందరగోళం నెలకొంది. మరోవైపు గో సంరక్షణకు పెద్దపీట వేస్తున్న మోదీ సర్కార్ మహిళలను మాత్రం పట్టించుకోదా అంటూ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు లోక్‌సభలోనూ ఇదే అంశంపై గందరగోళం నెలకొంది. అనంతరం లోక్‌సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.