భోపాల్/న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సంబంధీకుల ఇళ్లు, కార్యాలయాలపై జరిపిన ఐటీ సోదాల్లో రోజుకొకటి చొప్పున విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఉద్దేశించిన నిధుల్ని ప్రచారానికి దారి మళ్లించినట్లు అనుమానాలు రేకిత్తిస్తున్న కీలక డైరీ తాజాగా బయటపడింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడి వద్ద నుంచి ఈ డైరీని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ప్రజా పనులు, మైనింగ్, ఎక్సైజ్, రవాణా, ఇంధనం ఇలా పలు విభాగాలకు కేటాయించిన నిధులు ఒక వైపు, ఖర్చులు మరోవైపు డైరీలో రాసి ఉన్నట్లు గుర్తించారు. ఖర్చుల్లో పీసీసీ, ఢిల్లీ–ఏఐసీసీ పేర్లు ప్రస్తావించడం సంచలనం రేపుతోంది.
ఢిల్లీ–మధ్యప్రదేశ్ మధ్య అక్రమ నగదు చెలామణికి పాల్పడుతూ రూ.281 కోట్ల విలువైన నగదును అక్రమంగా నిల్వచేసిన వ్యవస్థీకృత రాకెట్‌ను గుర్తించినట్లు అధికారులు ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఎన్నికల వేళ ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థల సోదాలు తటస్థంగా ఉండాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు స్పందిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం బదులు పంపింది. మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి నగదు అక్రమ రవాణా జరుగుతోందని విశ్వసనీయ సమాచారం అందడంతోనే సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 50 చోట్ల జరిగిన ఐటీ దాడులు మరో రెండు ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించింది.
విపక్షాలను అడ్డుకునేందుకే: అహ్మద్ పటేల్
విపక్ష నాయకులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయకుండా అడ్డుకునేందుకే ఆదాయ పన్ను ఎగవేత పేరిట సోదాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ ఆరోపించారు. ఐటీ దాడులకు భయపడేది లేదని, ఎన్నికలకు ముందు రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడం బీజేపీలో నెలకొన్న నిరాశ, నిస్పృహలను సూచిస్తున్నాయని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి దేశ ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment