ఎన్సీపీ వద్దు.. శివసేనే ముద్దు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆర్ఎస్ఎస్ బీజేపీకి స్పష్టమైన సంకేతాలు పంపింది.
అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి బయటనుంచి మద్దతు ఇస్తామని ఎన్సీపీ ముందుకు వచ్చింది. అయితే ఇందుకు ఆర్ఎస్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. శివసేనతోనే కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఆదేశాలు జారీచేసింది. బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. శివసేన, బీజేపీ మైత్రి కొనసాగించాలని ఒత్తిడి చేస్తున్నారు. 25 ఏళ్లుగా మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, శివసేన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో విభేదాలు రావడంతో ఒంటరిగా పోటీ చేశాయి. మహారాష్ట్రలో పొత్తు వికటించినా శివసేన కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సయోధ్యకు మంతనాలు జరుగుతున్నాయి.