భోపాల్: సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద వివరాలను కోరిన ఓ వ్యక్తికి మధ్యప్రదేశ్ అధికారులు షాకిచ్చారు. సమాచారాన్ని ఇచ్చేందుకు ఖర్చయిన మొత్తంపై వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ను కూడా విధించారు. మధ్యప్రదేశ్ రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ(రెరా) కార్యాలయం ఆధునీకరణకు ఎంత ఖర్చయిందో చెప్పాలని సామాజిక కార్యకర్త అజయ్ దూబే ఆర్టీఐ కింద పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మధ్యప్రదేశ్ గృహ, మౌలిక వసతుల కల్పన బోర్డు 18 పేజీల సమాచారానికి రూ.43 వసూలు చేసింది.
వాస్తవంగా సమాచారాన్ని ఇచ్చేందుకు రూ.36 ఖర్చుకాగా, కేంద్ర జీఎస్టీ, రాష్ట్ర జీఎస్టీ కింద చెరో రూ.3.5ను వసూలు చేశారు. ఈ విషయమై పిటిషన్ దూబే స్పందిస్తూ.. ఆర్టీఐ చట్టం–2005 ప్రకారం ఇచ్చే సమాచారం సేవ కాదనీ, దీనిపై జీఎస్టీ వసూలు చేయకూడదని తెలిపారు. ఆర్టీఐ చట్టం ప్రకారం కేంద్ర ప్రజా సమాచార అధికారి (సీపీఐవో) కేవలం సమాచారాన్ని కాపీ చేసేందుకు ఖర్చయ్యే మొత్తాన్ని మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుందనీ, వీటిపై అదనంగా జీఎస్టీని విధించరాదని కేంద్ర సమాచార కమిషనర్ ఎం.శ్రీధర్ ఆచార్యులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment