‘ఆర్‌టీఐ’పై జశోదా అప్పీలు
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సతీమణి హోదాలో తనకు కల్పించవలసిన భద్రతకు సంబంధించిన వివరాలను కోరుతూ జశోదాబెన్ సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ)కింద చేసుకున్న దరఖాస్తును తిరస్కరించడంతో ఆమె అప్పీలును దాఖలు చేశారు. ఈ మేరకు ఆమె మెహసానా జిల్లా ఎస్‌పీకి డిసెంబర్ 30న అప్పీలు చేసుకున్నారు.
తనకు కల్పించవలసిన భద్రతపై వివరాలను కోరుతూ జశోదాబెన్ నవంబర్ 24న గుజరాత్‌లోని మెహసానా జిల్లా పోలీసు విభాగానికి దరఖాస్తు చేయగా.. ఆ సమాచారం స్థానిక ఇంటెలిజెన్స్ విభాగం పరిధిలోకి వస్తుందని, ఆర్టీఐ నుంచి ఇంటెలిజెన్స్ సమాచారానికి మినహాయింపు ఉందంటూ పోలీసు శాఖ ఆమె దరఖాస్తును తిరస్కరించిన సంగతి తెలిసిందే.
అయితే మెహసానా జిల్లా డిప్యూటీ ఎస్‌పీ తనకు పంపిన లేఖలో దరఖాస్తును తిరస్కరించడానికి స్పష్టమైన కారణం పేర్కొనలేదని, కొందరి జోక్యం వల్లే తన దరఖాస్తును తిరస్కరించారని ఆమె అప్పీలులో ఆరోపించారు. స్థానిక ఇంటెలిజెన్స్ విభాగం సమాచారానికి మినహాయింపు ఉందన్న రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వుల కాపీని కూడా తనకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.