గుర్‌గావ్ కేసులో సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీః గుర్‌గావ్ ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏడేళ్ల బాలుడి హత్యపై సీబీఐ విచారణను కోరుతూ అతడి తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం కేంద్రం, హర్యానా సర్కార్, సీబీఎస్‌ఈలకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ కేవలం ఈ ఒక్క కేసుకే పరిమితం కాదని, దేశమంతటా దీని ప్రభావం ఉంటుందని విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ పేర్కొంది.
మూడు వారాల్లోగా దీనిపై స్పందించాలని కోరుతూ కేంద్రం, హర్యానా సర్కార్, సీబీఎస్‌ఈలను కోరింది. ఈ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో సీబీఐచే నిష్పాక్షిక విచారణ చేపట్టాలని బాధితుడి తండ్రి వరుణ్ చంద్ర ఠాకూర్ తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. ఈనెల 8న గుర్‌గావ్‌లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లోని టాయ్‌లెట్‌లో బాలుడు దారుణ హత్యకు గురై రక్తంమడుగులో కనిపించిన విషయం విదితమే. స్కూల్ బస్ కండక్టర్‌లలో ఒకరైన అశోక్ కుమార్ బాలుడిని లైంగికంగా వేధించే ప్రయత్నాల్లో హతమార్చాడనే ఆరోపణలపై అతడిని అదేరోజు అరెస్ట్ చేశారు.