న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు ఉద్దేశించిన ఎలక్టోరల్ బాండ్ల పథకం అమలుపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఎలక్టోరల్ బాండ్లపై లోతుగా విచారించాల్సిన అవసరముందని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ విషయంలో పూర్తి వివరాలతో మరో పిటిషన్ దాఖలు చేయాలని ఎన్జీవో సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్)కు సూచించింది. ఏడీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ.. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల నుంచి రాజకీయ పార్టీలకు నిధులు అందుతున్నాయని తెలిపారు. ఈ నిధుల్లో 95 శాతం అధికార పార్టీకే దక్కాయని గుర్తుచేశారు. నిధులపై పారదర్శకత లోపించిన నేపథ్యంలో ఈసీ కూడా దీన్ని వ్యతిరేకించిందన్నారు. ఈ వాదనల్ని ఖండించిన అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్.. నల్లధనాన్ని నియంత్రించేందుకే ఈ బాండ్లను కేంద్రం తీసుకొచ్చిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment