సాక్షి, న్యూఢిల్లీ : నూతన పార్లమెంట్ భవన నిర్మాణాలకు రూ 20,000 కోట్లతో చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సంబంధించి క్షేత్రస్ధాయి పనులను అడ్డుకోలేమని సర్వోన్నత న్యాయస్ధానం శుక్రవారం తేల్చిచెప్పింది. నిర్మాణ పనులకు అనుమతులివ్వడంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ప్రాజెక్టు పనులపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. చట్టబద్ధంగా తమ విధులను నిర్వర్తించే అధికారలను నిలువరించగలమా అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎం కన్విల్కార్ పిటిషనర్‌ను ప్రశ్నించారు.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ సర్వోన్నత న్యాయస్ధానం వద్ద పెండింగ్‌లో ఉన్నా ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇస్తోందని పిటిషనర్ రాజీవ్ సూరి తరపు న్యాయవాది శిఖిల్ సూరి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కాగా పిటిషనర్ల ఆరోపణలపై జులై 3లోగా ప్రభుత్వం బదులివ్వాలని కోరుతూ జులై 6 తర్వాత పిటిషన్‌పై విచారణను చేపడతామని కోర్టు పేర్కొంది. పార్లమెంట్ భవన నిర్మాణానికే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు చేపడుతుంటే పిటిషనర్‌కు అభ్యంతరం ఏమిటని ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment