న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల్లోని న్యాయవాదులకు సీనియర్ హోదా కల్పించే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాలను ప్రకటించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ‘‘కమిటీ ఫర్ డెజిగ్నేషన్ ఆఫ్ సీనియర్ అడ్వొకేట్స్’’పేరిట శాశ్వత కమిటీని ఏర్పాటు చేయాలని, ఈ కమిటీ సీనియర్ న్యాయవాది హోదా కల్పించే అంశానికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు సీనియర్ జడ్జిలతోపాటు బార్ కౌన్సిల్‌కు ప్రాతినిధ్యం కల్పించాలని పేర్కొంది.
న్యాయవాదుల చట్టం 1961లోని సెక్షన్ 16 ప్రకారం సీనియర్ న్యాయవాదిగా హోదా కల్పించే అధికారం సుప్రీంకోర్టుకు, హైకోర్టులకు లేదని, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తోసిపుచ్చింది. సరైన పద్ధతులను అనుసరించకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయని, దీనిని కారణంగా చూపి సెక్షన్ 16ను తొలగించలేమని పేర్కొంది. సీనియర్ అడ్వొకేట్ ఇందిరా జైసింగ్‌తో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన నాలుగు పిటిషన్లను కొట్టేసింది. తీర్పులో సీనియర్ న్యాయవాదుల నియామకం సజావుగా సాగేందుకు 11 మార్గదర్శకాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు చేసే కమిటీలో సుప్రీంకోర్టు లేదా హైకోర్టుల్లోని ఇద్దరు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులకు, అటార్నీ జనరల్ లేదా ఓ రాష్ట్రానికి చెందిన అడ్వొకేట్ జనరల్‌కు స్థానం కల్పించాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment