
ఎన్సీపీ కూడా ‘చెయ్యి’స్తుందా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంలో ఏకమవుతున్న ప్రతిపక్షాల కూటమి నుంచి బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ జేడీయూ ఇప్పటికే తప్పుకోగా ఇప్పుడు శరద్ యాదవ్ నాయకత్వంలోని ఎన్సీపీ తప్పుకోనుందని ఊహాగానాలు బయల్దేరాయి. సోనియా గాంధీ నాయకత్వాన శుక్రవారం జరిగిన విపక్షాల సమావేశానికి ఎన్సీనీ హాజరుకాకపోవడమే ఈ ఊహాగానాలకు కారణమైంది. నితీష్ కుమార్ పార్టీ జేడీయూ విపక్షాల కూటమి నుంచి తప్పుకున్న నేపథ్యంలో జరిగినందున ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
కేంద్రంలో బీజేపీ నేతత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎలా సమర్థంగా ఎదుర్కోవాలనే అంశంపై సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ప్రధానంగా ప్రతిపక్షాల ఐక్యతను చాటేందుకే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాంటి సమావేశానికి ఎన్సీపీ రాకపోవడం ఊహాగానాలకు తెరలేపింది. ఇంతకుముందు జరిగిన అన్ని విపక్షాల సమావేశానికి శరద్ పవార్ హాజరయ్యారు. ఈసారి మాత్రం తాను అనారోగ్య కారణాల వల్ల రాలేకపోతున్నానని కబురు పంపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబోలు అనుకున్నారు. ఇంతలో తాము సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ఎన్సీపీ సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ బహిరంగంగా ప్రకటించడం వారిని ఇరుకున పెట్టింది.
ఇటీవల గుజరాత్ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ పటేల్‌కు ఓటు వేసినప్పటికీ వేయలేదని కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నందున తాము అసంతప్తితో ఉన్నట్లు ఎన్సీపీ నాయకులు తెలిపారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా బయట మాట్లాడకపోయినా అంతర్గతంగా పార్టీ నాయకులు తమ అనుమానాన్ని ఎన్సీపీ నాయకుల ముందు బయటపెట్టారు. అహ్మద్ పటేల్ ఒక్క ఓటుతో ఆ ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెల్సిందే. జేడీయూ వేయడం వల్ల ఆ ఒక్క ఓటుతో గట్టెక్కామని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
కేంద్రంలో, అటూ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ మొదటి నుంచి కలసి కాపురం చేస్తున్నప్పటికీ ఎన్సీపీ పట్ల కాంగ్రెస్‌కు ఎన్నడూ పూర్తి విశ్వాసం లేదు. అందకు కారణం శరద్ పవార్ అన్ని రాజనీయ పార్టీలతో సన్నిహితంగా ఉండడమే. ఎప్పుడు ఎవరి పట్ల ఎలా వ్యవహరిస్తారో ఎవరికి అర్థం కాకపోవడమే. ఆయన రాజకీయ కదలికలు అర్థం కాకపోవడం వల్ల మున్ముందు బీజేపీ–శివసేన కూటమి ప్రభుత్వం నుంచి శివసేన తప్పుకున్న పక్షంలో బీజేపీకి ఎన్సీపీ తప్పకుండా మద్దతిస్తుందన్నది కాంగ్రెస్ విశ్వాసం. 2019 సార్వత్రిక ఎన్నికలను దష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష కూటమికి దూరంగా ఉండాల్సిందిగా ఆది నుంచి ఎన్సీపీపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోంది. శరద్ పవార్ సమీప బంధువు అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉండడం, అలాగే సీనియర్ ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్ యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర విమానయాన శాఖా మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉండడం వల్ల వారు మోదీ ఒత్తిళ్లకు లొంగిపోతున్నారన్నది రాజకీయ విశ్లేషకుల భావన.
కేంద్రంలోని దర్యాప్తు సంస్థల ద్వారా లాలూ ప్రసాద్ నాయకత్వంలోని ఆర్జేడీతో జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ తెగతెంపులు చేసుకునేలా చేసిందీ మోదీయేనని, ఇప్పుడు ఎన్సీపీపై కూడా అలాగే ఒత్తిడి తెస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్షాల కూటమి నుంచి ఎన్సీపీ కూడా తప్పుకుంటే ఆ కూటమికి పెద్ద నష్టమే. విపక్షాలన్నీ ఎలా కలసికట్టుగా వెళ్లాలో, ప్రభుత్వాన్ని దబ్బెతీసే విధంగా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టాలో నిర్ణయం తీసుకునేందుకు సోనియా గాంధీ మొన్నటి సమావేశంలో ఓ కమిటీని వేశారు. ఆ కమిటీ సిఫార్సుల మేరకు తదుపరి కార్యాచరణ ఉండవచ్చు.