
తిరువనంతపురం : బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే దేశాన్ని హిందూ పాకిస్తాన్‌గా మారుస్తుందన్న కాంగ్రెస్ నేత శశి థరూర్ వ్యాఖ్యలతో ఆగ్రహించిన ఆ పార్టీ యువజన విభాగం కార్యకర్తలు సోమవారం ఆయన కార్యాలయానికి నల్లరంగు పులిమారు. బీజేవైఎం నిరసనలపై శశి థరూర్ స్పందిస్తూ ప్రజలు తమ సమస్యలతో ముందుకు వస్తే మీరు వారిని ఇలా భయపెడుతున్నారు..దేశం ఇదే కోరుకుంటున్నదా అంటూ ప్రశ్నించారు. తాను ఎంపీగా కాకుండా సాధారణ పౌరుడిలా కోరుతున్నానని, నాకు తెలిసిన హిందూయిజం ఇది కాదని వ్యాఖ్యానించారు.
బీజేవైఎం కార్యకర్తలు నిరసన తెలిపిన సమయంలో శశి థరూర్ కార్యాలయంలో లేరు. బీజేవైఎం కార్యకర్తలు థరూర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన కార్యాలయంలోకి చొచ్చుకువచ్చారు. కార్యాలయంలో హిందూ పాకిస్తాన్ అనే బ్యానర్‌ను వారు అతికించారు.శశి థరూర్ ఇచ్చిన తప్పుడు ప్రకటనకు నిరసనగానే తాము ఈ కార్యక్రమం చేపట్టామని తిరువనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎస్ సురేష్ పేర్కొన్నారు.
అయితే బీజేపీ నిరసనలను పలువురు కాంగ్రెస్ నేతలు ఖండించారు. ఇది బీజేపీ అహంకార వైఖరికి నిదర్శనమని కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎంఎం హసన్, అసెంబ్లీలో విపక్ష నేత రమేష్ చెన్నితల ఆరోపించారు.