సియాచిన్ : సియాచిన్ గ్లేసియర్‌లో విధులు నిర్వర్తించే సైనికులు స్నానం చేసేందుకు నెలల తరబడి వేచి చూడాల్సిన పనిలేదని ఆర్మీ ఉన్నతాధికారి తెలిపారు. ‘సియాచిన్ గ్లేసియర్‌లో పనిచేసే సైనికులు విధులు నిర్వర్తించే క్రమంలో 90 రోజులపాటు స్నానం చేయకుండా ఉండాల్సివస్తోంది. ఇకపై ఇలాంటి పరిస్థితులు ఉండబోవు. వీరి కోసం ప్రత్యేకంగా వాటర్‌లెస్ బాత్ ప్రొడక్ట్స్ అందుబాటులోకి రానున్నాయి. 20 మిల్లీలీటర్ల జెల్ కలిగి ఉండే ఈ సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా... వారు రెండు వారాలకొకసారి స్నానం చేయవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి(సుమారు 22 వేల అడుగుల ఎత్తు) సియాచిన్‌లో సుమారు 3వేల మంది సైనికులు విధులు నిర్వర్తిస్తారు. అత్యంత శీతలమైన ఈ ప్రదేశంలో ఉష్ణోగ్రతలు ఒక్కోసారి మైనస్ 60 డిగ్రీలకు పడిపోతాయన్న సంగతి తెలిసిందే. ఇక్కడ గస్తీ కాసేందుకు ప్రభుత్వం రోజుకు సుమారు ఐదు నుంచి 7 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తోంది. ఇక ఇక్కడ పనిచేసే సైనికుల సమస్యలు, అవసరాలు తెలుసుకునే క్రమంలో ఆర్మీ డిజైన్ బ్యూరో(ఏడీబీ) 2016లో రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థను ఏర్పాటు చేసింది. ఇది సైనికులకు, వివిధ రకాల వస్తువులను ఉత్పత్తి చేసే పలు ప్రైవేటు సంస్థలకు మధ్య వారధిలా పనిచేస్తుంది.
ఈ నేపథ్యంలో సైనికుల పరిశుభ్రత దృష్ట్యా హైజెనిక్ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. కాగా విధి నిర్వహణలో భాగంగా యుద్ధ ట్యాంకుల పనితీరులో లోపాలు, తాత్కాలిక బ్రిడ్జీల నిర్మాణం, సాంకేతిక అంశాల్లో జాప్యం తదితర సుమారు 130 రకాల సమస్యలను సైనికులు ఏడీబీ దృష్టికి తీసుకురాగా.. అందులో ప్రస్తుతం 25 సమస్యలు పరిష్కారమైనట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment