విద్యార్థులతో సిద్ధరామయ్య
బెంగళూరు: తన బాల్యంలో శని, ఆదివారాలలో గేదెలు కాసేవాడినని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా చెప్పారు. విధానసౌధలో ఈరోజు నిర్వహించిన 'బాలల హక్కుల పార్లమెంట్' అనే కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఓపికగా, ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. చిన్నప్పుడు తన చేత బీడీలు తెప్పించేవారని, వాటిని తానోసారి కాల్చి ఆ తర్వాత తెచ్చి ఇచ్చేవాడినని చెప్పారు. ఇలా తన చిన్ననాటి అనుభవాలను అనేకం వారితో పంచుకున్నారు. తాను ఫ్యాంటు ఎప్పుడు వేసుకున్నది, చెప్పులు ఎప్పుడు వేసుకున్నది... ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు అనేకం ఆయన తెలిపారు.
''నేను ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు అసలు పాఠశాలకే వెళ్లలేదు. అప్పట్లో మా ఊరిలో ఎక్కువగా జానపద కళలకు ప్రాధాన్యం ఉండేది. దాంతో మా నాన్న నన్ను ఆయా కళలు నేర్చుకునేందుకు పంపేవారు. నాకు జానపద కళలు నేర్పించే మాస్టారే నాకు అక్షరాలు నేర్పించారు. ఆయన ప్రోత్సాహంతోనే నేరుగా ఐదో తరగతిలో చేరాను. అప్పుడు పాఠశాలకు వెళ్తూనే నా తల్లిదండ్రులకు వ్యవసాయంలో సహాయం చేసే వాడిని. శని, ఆదివారాల్లో గేదెలు కాసేవాడిని. ఇప్పట్లోలా అప్పుడు మాకు సరైన దుస్తులు కూడా లేవు. నేను ఫ్యాంట్ వేసుకుంది ఎనిమిదో తరగతికి వచ్చాక. అప్పటి వరకు నిక్కర్లే వేసుకున్నాను. మొదటి సారిగా చెప్పులు వేసుకుంది కూడా ఎనిమిదో తరగతికి వచ్చాకే. అప్పటి వరకు రోజూ పాఠశాలకు రెండు కిలోమీటర్లు చెప్పులు లేకుండానే నడుచుకుంటూ వెళ్లేవాడిని''అని గత స్మృతులను నెమరువేసుకున్నారు.
**