
హాఫ్ సెంచరీ దాటిన ఆప్...
ఢిల్లీ ప్రజలు సామాన్యుడికే మళ్లీ పట్టం కట్టారు. కమలాన్ని చీపురు ఊడ్చేయటంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యుడి దరహాసం వెల్లివిరిసింది.
న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రజలు సామాన్యుడికే మళ్లీ పట్టం కట్టారు. కమలాన్ని చీపురు ఊడ్చేయటంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యుడి దరహాసం వెల్లివిరిసింది. పెహ్లే ఆప్ అని ఢిల్లీ ఓటర్లు తీర్పునివ్వబోతున్నారు. దాంతో ఢిల్లీ బాద్‌షా ఎవరనే ఉత్కంఠకు దాదాపు తెరపడింది. ఆమ్ ఆద్మీ పార్టీ సాధారణ మెజార్టీ కంటే ఎక్కువ సీట్లతో ముందంజలో ఉంది. 53 స్థానాల్లో ఆప్ దూకుడు కొనసాగుతోంది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలున్నాయి. ఇందుకు సంబంధించి ఈ నెల 7న పోలింగ్ జరిగింది. గతంతో పోలిస్తే రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. దాదాపు 67 శాతం పోలింగ్ నమోదైంది.
ఈ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ప్రభంజనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గాలి వీస్తున్నా ఢిల్లీ వాసులు మాత్రం అందుకు భిన్నంగా తీర్పునిస్తున్నారు. ఎంతో మంది బీజేపీ ప్రముఖులు ప్రచారం చేసినా ఫలితం మాత్రం ఆప్ వైపే వస్తోంది.
గత (2013) ఎన్నికల్లో కాంగ్రెస్ను ఊడ్చేసిన ఆప్ ఈసారి బీజేపీనీ ఊడ్చేసిందనే చెప్పాలి. ఆ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా 32 స్థానాలు గెలుచుకుంది. స్పష్టమైన మెజారిటీ రాకపోయినా కాంగ్రెస్తో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ప్రతికూల ఫలితాలే వస్తున్నాయి. తాజా ఎన్నికల్లో ఆప్ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు సాధించే అవకాశం ఉంది.