
లక్నో : ఆవును వధించిన ఆరుగురిని ఉత్తరప్రదేశ్ పోలీసులు గురవారం అరెస్టు చేశారు. ఘటనలో ప్రమేయమున్న మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. ఎస్పీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీఎస్పీ నాయకురాలు రుచీ వీర డెయిరీ ఫాం సమీపంలో ఈ ఘటన వెలుగుచూడటం గమనార్హం. ఎస్పీ లక్ష్మీనివాస్ మిశ్రా వివరాల ప్రకారం.. భగవాలా ఔట్‌పోస్టు సమీపంలోని జఖారి బంగర్ గ్రామంలో బీఎస్పీ నేత రుచీ వీర డెయిరీ ఫాంలో గోవధ జరుగుతోందనే సమాచారం వచ్చింది. దీంతో పెట్రోలింగ్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే, అక్కడ ఎవరి జాడా లేదు.
పక్కనే ఉన్న చెరుకు తోటలో గాలింపు చేపట్టగా.. ఆవును వధించిన 13 మంది కంటబడ్డారు. దాడి చేసి ఆరుగురిని పట్టుకున్నాం. మరో ఏడుగురు పరారయ్యారు. త్వరలో వారిని పట్టుకుంటాం.ఘటనాస్థలం నుంచి రెండు క్వింటాళ్ల మాంసం, ఆవు చర్మం, మిగతా అవశేషాలు స్వాధీనం చేసుకున్నాం. పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించాం. నిందితుల్ని స్టేషన్‌కు తరలించాం. 13 మందిపైనా కేసులు నమోదు చేశాం. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే రుచీ వీరకు ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నాం. నిందితులు షకు, జహీద్, ఓసాఫ్, జుబైర్, నానూ, తస్లీం అరెస్టు చేయగా.. గుఫ్రాన్, నయీముద్దీన్, షకీల్, వీల్, రాయీస్, ఫయీం, అబ్రార్‌గా పరారీలో ఉన్నారు.
ఫాం మాదే.. గోవధతో సంబంధం లేదు..
రుచీ వీర భర్త ఉదయన్ వీర మాట్లాడుతూ.. మాకు జఖారి బంగర్‌లో డెయిరీ ఫామ్ ఉన్న మాట నిజమే. కానీ, పశువధతో మాకు సంబంధం లేదు. అక్కడొక వాచ్‌మన్‌ను నియమించాం. అక్కడేం జరిగింది అతనికే తెలుస్తుంది. ఈ చర్యకు పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలి. కాగా, లోక్‌సభ తాజా ఎన్నికల్లో ఆన్లా నుంచి పోటీచేసి రుచీ ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment