
రాయ్‌బరేలి నుంచి విజయం సాధించిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణస్వీకారోత్సవానికి యూపీఏ ఛైరపర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. గురువారం రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి రాహుల్, సోనియాలతో పాటు కాంగ్రెస్ ముఖ్యనేతలు హాజరవుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలి నుంచి సోనియా గాంధీ విజయం సాధించగా.. రాహుల్ అమేథిలో ఓడి వయనాడ్‌లో గెలిచారు.
ఈ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయగా.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తిరస్కరించిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగాల్సిందిగా పార్టీ ముఖ్యనేతలు పట్టుబడుతుండగా రాహుల్ మాత్రం విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ ప్రమాణస్వీకారానికి ఆయన హాజరవుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక దేశ ప్రధానిగా మరోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో దేశ, విదేశీ నేతలు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమానికి హజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మంత్రులచే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో భారత్ సహా బిమ్స్‌టెక్ సభ్యదేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాధినేతలు పాల్గొంటారని అధికారులు తెలిపారు.