సంకుచిత దేశంగా మార్చే కుట్ర | Sonia Gandhi fires on modi | Sakshi
Sakshi News home page

సంకుచిత దేశంగా మార్చే కుట్ర

Published Wed, Jun 7 2017 1:24 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

సంకుచిత దేశంగా మార్చే కుట్ర - Sakshi

సంకుచిత దేశంగా మార్చే కుట్ర

కశ్మీర్‌ పరిస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం
► విమర్శకుల గొంతు నొక్కేస్తున్నారు
► సీడబ్ల్యూసీ భేటీలో మోదీ సర్కారుపై సోనియా ధ్వజం


న్యూఢిల్లీ: మూడేళ్ల పాలనా సంబరాలు జరుపుకుంటున్న మోదీ సర్కారుపై విపక్ష కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రాజధానిలో మంగళవారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌.. ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. భారత్‌ను తిరోగమన, సంకుచిత దేశంగా మార్చే కుట్ర జరుపుతున్నారని కేంద్ర ప్రభుత్వంపై సోనియాగాంధీ ధ్వజమెత్తారు. ప్రపంచ దేశాల దృష్టిలో భారత్‌కున్న ప్రత్యేక ముద్రను ఈ ప్రభుత్వం చెరిపేసే ప్రయత్నం చేస్తోందని.. ఆ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు, దేశ మౌలిక భావనను పరిరక్షించేందుకు 2019లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చే దిశగా సిద్ధం కావాలని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

దేశవ్యాప్తంగా రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మన్మోహన్‌ సింగ్, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సీనియర్‌ నేతలు ఏకే ఆంటోనీ, పీ చిదంబరం, అహ్మద్‌ పటేల్, దిగ్విజయ్‌ సింగ్, గులాం నబీ ఆజాద్‌ తదితరులు పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ పరిస్థితి, త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలు.. తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను ఆమోదించారు. భేటీలో సోనియా మాట్లాడుతూ.. ఆర్థికాభివృద్ధికి దోహదపడే అంశాల్లో స్తబ్దత నెలకొందని విమర్శించారు. కశ్మీర్‌ పరిస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విమర్శకుల గొంతు నొక్కేస్తు న్నారని మండిపడ్డారు. మేకిన్‌ ఇండియాతో ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగావకాశాలు రాలేదన్నారు.

నోట్ల రద్దు విఫల ప్రయత్నం
భేటీలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌  మాట్లాడుతూ.. నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఆ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బతీసిందన్నారు. గత మూణ్నెళ్ల జీడీపీలో తగ్గుదల అదే విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. ‘దేశంలో ఉపాధి అవకాశాలను భారీగా కల్పించే నిర్మాణ రంగం నోట్ల రద్దుతో కుదేలైంది. ప్రైవేటు రంగ పెట్టుబడులు దారుణంగా పడిపోయాయి.

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ప్రభుత్వ వ్యయం అనే ఏకైక ఇంజిన్‌పైనే నడుస్తోంది’ అని వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ పనితీరుకు గ్రాస్‌ వ్యాల్యూ అడిషన్‌(జీవీఏ)’ అనేది ఒక కచ్చితమైన సూచీ. 2016 మార్చిలో పరిశ్రమల రంగంలో 10.7 శాతంగా ఉన్న జీవీఏ.. 2017 మార్చి నాటికి దారుణంగా 3.8 శాతానికి పడిపోయింది’ అని మన్మోహన్‌ వివరించారు.  

పార్టీ ఎన్నికల షెడ్యూల్‌
ఆగస్ట్‌ 6: సభ్యుల తుది జాబితా, జిల్లా కాంగ్రెస్‌ కమిటీలు రూపొందించిన అర్హులైన పోటీదారుల తుది జాబితా ప్రచురణ. ఆగస్ట్‌ 7– ఆగస్ట్‌ 20: బూత్‌ కమిటీలు, బ్లాక్‌ కమిటీ సభ్యుల ఎన్నిక. ఆగస్ట్‌ 21–సెప్టెంబర్‌ 4: బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కోశాధికారి, కార్యనిర్వాహక కమిటీ ఎన్నిక.

బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీచే డీసీసీకి ఆరుగురు సభ్యుల ఎన్నిక, పీసీసీకి ఒక సభ్యుడి ఎన్నిక. సెప్టెంబర్‌ 5–15: డీసీసీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కోశాధికారి, కార్యనిర్వాహకవర్గ ఎన్నిక. సెప్టెంబర్‌ 16– అక్టోబర్‌ 15: పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక, ఉపాధ్యక్షుడు, కోశాధికారి, పీసీసీ కార్యవర్గ, ఏఐసీసీ సభ్యుల ఎన్నిక. చివరగా పార్టీ అధ్యక్షుడు/అధ్యక్షురాలి ఎన్నిక. అక్టోబర్‌ 16–25 మధ్య ఏఐసీసీ సభ్యులకు ప్రదేశ్‌ ఎన్నికల అథారిటీ గుర్తింపు కార్డులు జారీచేస్తుంది. చివరగా, ఏఐసీసీ సభ్యులు సీడబ్ల్యూసీ సభ్యులను ఎన్నుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement