
చాంపియన్ షూటర్ ఫతేసింగ్ కు కేంద్ర మంత్రి నివాళి
న్యూఢిల్లీ: ఉగ్రవాదుల దాడిలో అమరుడైన అంతర్జాతీయ ఛాంపియన్ షూటర్, సుబేదార్ మేజర్ ఫతేసింగ్(51) మృతిపట్ల కేంద్ర క్రీడాశాఖమంత్రి సర్బానంద సోనోవాల్ నివాళులర్పించారు. మేజర్ ఫతేసింగ్ మృతిపట్ల ట్విట్టర్లో విచారం వ్యక్తం చేశారు. ఫతేసింగ్ 1995నాటి తొలి కామన్‌వెల్త్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండు బంగారు, ఒక రజత పతకం గెలిచారు. డోగ్రా రెజిమెంట్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్న ఫతేసింగ్ డిఫెన్స్ సెక్యూరిటీ కోర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మేజర్ చేసిన సేవల్ని పేర్కొంటూ ఆయనకు సెల్యూట్ అని ట్విట్టర్ పోస్టులో రాసుకొచ్చారు.
పాక్ ముష్కరులు పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై శనివారం దాడులు జరుపుతుండగా, ఉగ్రవాదులను తుదముట్టించే ఆపరేషన్లో ఆయన కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే. దేశం ఒక గొప్ప రైఫిల్ షూటర్, కోచ్ను కోల్పోయిందంటూ కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. 2009లో డోగ్రా రెజిమెంట్ లో సుబేదార్ మేజర్ పదవి నుంచి 2009లో రిటైర్ అయ్యారు. అనంతరం డిఫెన్స్ సర్వీస్లో చేరి విధులు నిర్వర్తిస్తున్నారు.