హామీలు మరిస్తే.. ఇక అంతేనా?
దేశం లేదా రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని అధికారంలోకి వస్తే ఎలా పరిష్కరిస్తారో సవివరంగా చేప్పేందుకు ఉద్దేశించినవే మేనిఫెస్టోలు. అయితే అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోవడం, కుంటిసాకులు చెప్పడం పార్టీలకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. హామీలను విస్మరిస్తే పార్టీలపై చర్యలు తీసుకునే చట్టాలేవీ భారత్‌లో లేవు. ఫలితంగానే పార్టీల హామీలు కోటలు దాటుతున్నాయి. హామీల అమలుకు చట్టాల్లో చేయాల్సిన మార్పులు, నిపుణుల సూచనల్ని ఓసారి పరికిస్తే...
పార్టీల్ని అదుపు చేసే చట్టాలు లేవు
పార్టీల్ని జవాబుదారీ చేయాలని 2013లో సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. భారత్‌లో అలాంటి చట్టమేదీ లేనందున పిటిషన్‌కు విచారణార్హత లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చింది. అయితే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు సూచించింది. దాంతో మేనిఫెస్టో తయారీకి అనుసరించాల్సిన విధివిధానాలపై 2014కు ముందు అన్ని రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశాలు నిర్వహించింది. రెండు కీలకమైన నిబంధనల్ని ఎన్నికల ప్రవర్తన నియమావళిలో చేర్చింది.
1. ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశామున్న హామీల్ని రాజకీయ పార్టీలు ఇవ్వకూడదు.
2. తామిచ్చిన హామీల్లో హేతుబద్ధతను మేనిఫెస్టోల్లో వివరించాలి. హామీల అమలుకు అవసరమైన నిధులు ఎలా వస్తాయో స్థూలంగా చెప్పాలి. అయితే రాజకీయ పార్టీలు ఈ నిబంధనల్ని ఏ కోశానా పాటించట్లేదు.
శిక్షార్హమైన నేరంగా పరిగణించాలి..
ఎన్నికల సంస్కరణల అవశ్యకత, చర్చించాల్సిన అవసరంపై కొద్ది కాలంగా ప్రధాని మోదీ ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనైనా ఎన్నికల్లో ధనప్రవాహానికి అడ్డుకట్ట వేయడం, రాజకీయాలు నేరమయం కాకుండా చూడటం, పార్టీ ఫిరాయింపులు... తదితర అంశాలతో పాటు మేనిఫెస్టోకు పార్టీల్ని జవాబుదారీ చేసే అంశంపై విస్తృతంగా చర్చ జరగాలి. మేనిఫెస్టోల్లో ఆచరణ సాధ్యమైన హామీల్ని పార్టీలు ఇచ్చే పరిస్థితి రావాలంటే ఏం చేయాలో నిపుణులు పలు సూచనలు చేశారు.
► అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టో హామీలను అమలు చేయకపోతే... శిక్షార్హమైన నేరంగా పరిగణించాలి. ఆ మేరకు చట్టాలు చేయాలి.
► ఏ హామీ అమలుకు ఎంత డబ్బు అవసరమవుతుంది... దాన్నెలా సమకూర్చుకుంటారో మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పడం తప్పనిసరి చేయాలి..
► ఏ హామీని ఎప్పటిలోగా చేస్తారో నిర్దిష్ట కాలపరిమితిని చెప్పాలి.
► ఏదైనా పథకాన్ని ఎంతమందికి వర్తింపజేస్తారో స్పష్టం చేయాలి. ఏ కొద్ది మందికో లబ్ధి చేకూర్చి పార్టీలు చేతులు దులుపుకునే అవకాశాలుంటాయి.
► మేనిఫెస్టోల తయారీ ఎన్నికలకు ఆరు నుంచి తొమ్మిది నెలల ముందే ప్రారంభం కావాలి. సంబంధిత నిపుణులతో విస్తృతంగా చర్చించి... సాధ్యాసాధ్యాల్ని మదింపు చేసుకోవాలి. ప్రజా వేదికలపై చర్చించాలి.
► ఎన్నికల మేనిఫెస్టోల్ని ఈసీ వద్ద రిజిస్టర్ చేయాలి. కొన్ని దేశాల్లో మేనిఫెస్టో సాధ్యాసాధ్యాల్ని పరిశీలించాకే విడుదలకు ఎన్నికల కమిషన్ అనుమతించే విధానం అమలులో ఉంది.
► ఉచిత హామీల్ని అనుమతించకూడదు. ఉచిత హామీలు, సబ్సిడీల వల్ల ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరుకు తమిళనాడు అప్పులు 2.52 లక్షల కోట్లకు చేరాయి.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్