‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ అంటే ఇదేనా?
న్యూఢిల్లీ: దారిద్య్ర నిర్మూలన, మహిళలకు సాధికారిత, విద్యాదానం, మానవ విలువలను పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాల ప్రాతిపదికన ఏర్పడిన ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ దేశ రాజధాని ఢిల్లీలో రైతుల పొట్టలు గొట్టింది. పర్యావరణ పరిరక్షిణను తుంగలో తొక్కింది. మొన్నటి వరకు పచ్చని పంటలతో ఏపుగా కాసిన కూరగాయలతో కళకళలాడిన పొలాలను జీసీబీలతో దున్నేసి రైతులకు దు:ఖాన్ని మిగిల్చింది. ఇప్పుడు ఎటూ పాలుపోని రైతులు తమకు ఇక ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. వారంత పనిచేస్తే ఆ పాపం ఎవరిది?
కేవలం గిన్నీస్ రికార్డు కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఇదంతా చేసింది. ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అంతర్జాతీయ సమ్మేళనం నిర్వహించేందుకు సన్నాహక ఏర్పాట్లు చేస్తోంది. దానికోసం ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకుంది. వారు యమునా నది పక్కన ఖాళీగా ఉన్న 80 ఎకరాల మైదాన ప్రాంతాన్ని సాంస్కృతిక సమ్మేళనం కోసం వాడుకోవాల్సిందిగా సూచించారు. అందుకు సరేనన్న ఫౌండేషన్ వర్గాలు ఇప్పుడు 150-175 ఎకరాల వరకు సమ్మేళనం కోసం ఉపయోగిస్తున్నారు. దాదాపు వంద ఎకరాలు మినహా మిగతా భూమంతా పంట పొలాలు, కూరగాయల తోటలే. వాటిన్నింటిని జేసీబీలు పెట్టి దున్నించి మైదాన ప్రాంతంగా మార్చేసింది.
రైతులు అడ్డం పడితే నష్ట పరిహారం చెల్లిస్తాం, పోపొమ్మంటూ తరమేసింది. అప్పటికి వినని రైతులను పోలీసుల చేత బెదిరించింది. తనది మూడున్నర ఎకరాల పొలమని, మొత్తం చదును చేశారని, కేవలం 26 వేల రూపాయలను నష్ట పరిహారంగా తన జేబులో పెట్టారని పాన్ సింగ్ అనే రైతు సోమవారం నాడు మీడియా ముందు వాపోయారు. వాస్తవానికి తాను ఈసారి పంట వేయడానికి 2.25 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని, అందులో ఎక్కువ భాగం బ్యాంకు నుంచి తీసుకున్న రుణమేనని ఆయన చెప్పారు. నాలుగు భీగాల భూమిలో తాను కాకరకాయ, కీర, బెండకాయ, గోబీలు పండిస్తున్నానని, తనకు 14వేల రూపాయల నష్టపరిహారం ఇచ్చి చదును చేశారని ధరమ్ సింగ్ ఆరోపించారు. వాస్తవానికి తాను గోబీ విత్తనాల కోసం 26 వేల రూపాయలను ఖర్చు చేశానని వాపోయారు. పంటలను కోల్పోయిన 200 రైతు కుటుంబాల్లో వీరిద్దరు.
ఈ విసయమై ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వారిని వివరణ కోరగా రైతులంతా భూములను అక్రమంగా ఆక్రమించిన వారేనని, తామె ఇంకా దయతలచి మానవతా హృదయంతో ఆర్థిక సహాయం చేశామని చెబుతున్నారు. ‘గ్రో మోర్ ఫుడ్’ పథకం కింద 1950లో అప్పటి ప్రభుత్వం యమున ఒడ్డునున్న ఈ పొలాలను రైతులకు ఇచ్చిందని ‘ఢిల్లీ పీజంట్ కోపరేటివ్ మల్టీ పర్పస్ సోసైటీ ప్రధాన కార్యదర్శి బల్జీత్ సింగ్ తెలిపారు.
పైగా యమునా నది ఒడ్డున ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని చట్ట నిబంధనలు ఉన్నాయి. పర్యావరణాన్ని పరిరక్షిస్తామంటూ చెప్పుకునే ఫౌండేషన్ చ ట్టాన్ని ఉల్లంఘించి 35 వేల మంది కూర్చుని కచేరీలు, మంత్రోచ్ఛారణలు చేసేందుకు వీలుగా భారీ వేదికను నిర్మించింది. అక్కడక్కడా భారీ అంబారీల విగ్రహాలను ఏర్పాటు చేసింది. ఈ సమ్మేళనానికి ప్రపంచ దేశాల నుంచి 35 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
బీజేపీ నాయకుడు ఎల్‌కే అద్వానీ, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కరణ్ సింగ్, ఢిల్లీ సాంస్కృతిక శాఖ మంత్రి కపిల్ మిశ్రా తదితరులు హాజరుకానున్నారు. ఎప్పుడూ మానవతా విలువల గురించి మాట్లాడే శ్రీశ్రీ రవిశంకర్ రైతులకు జరిగిన అన్యాయం పట్ల పెదవి విప్పడం లేదు. ఇక చేసేదేమీ లేక రైతులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తికి పిటీషన్ పెట్టుకున్నారు. కొన్ని ఎన్జీవో సంస్థలు ఇప్పటికే రైతుల తరఫున కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమ్మేళనం ఏర్పాట్లు దాదాపు 80 శాతం పూర్తయ్యాయని, ఈ దశలో కోర్టు కూడా ఏంచేయలేదని ఫౌండేషన్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.