
సాక్షి, ముంబయి : కోట్లాది అభిమానులను దుఖఃసాగరంలో ముంచి సుదూరతీరాలకు పయనమైన నటి శ్రీదేవి అంత్యక్రియలు ముంబయిలో అధికార లాంఛనాల మధ్య ముగిసిన సంగతి తెలిసిందే. శ్రీదేవి అస్థికలను సముద్రంలో కలిపేందుకు ఆమె భర్త బోనీకపూర్ ఇతర కుటుంబసభ్యులతో కలిసి రామేశ్వరం వెళ్లేందుకు చెన్నై చేరుకున్నారు. అస్థికల నిమజ్జనం అనంతరం వెనువెంటనే వారు ముంబయి తిరిగివెళతారు.
బోనీకపూర్ బృందం ముంబయి నుంచి చార్టర్డ్ విమానంలో శుక్రవారం సాయంత్రం చెన్నై చేరుకున్నారు. అక్కడి నుంచి రామేశ్వరం వెళ్లి అస్ధికలు నిమజ్జనం చేస్తారు. నదుల్లో మరణించిన వారి అస్థికలు కలపడం హిందూ సంప్రదాయంలో భాగం. నదీతీర్థాల్లో కర్మకాండలు ఆచరించిన అనంతరం పవిత్ర నదుల్లో అస్థికలు నిమజ్జనం చేయడం ఆనవాయితీ. అనితర సాధ్యమైన తన నటనతో అశేష అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి మేనల్లుడి వివాహానికి హాజరై దుబాయ్ హోటల్‌లో ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మునిగి మరణించారు. ఆమె మృతిపై పలు సందేహాలు వ్యక్తమైనా వాటికి తెరదించుతూ కేసును క్లోజ్ చేస్తున్నట్టు దుబాయ్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది.