
దూసుకుపోతున్న ఫరూఖ్ అబ్దుల్లా
జమ్ముకశ్మీర్: శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆది నుంచే నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఫరూక్ అబ్దుల్లా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రూలింగ్ పార్టీ పీడీపీ అభ్యర్థి నాజిర్ అహ్మద్‌ఖాన్ కంటే ఆయన స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈనెల తొమ్మిదో తేదీన జరిగిన ఈ ఉపఎన్నికలో మొత్తం తొమ్మిదిమంది అభర్థులు పోటీపడ్డారు. పీడీపీ నేత తారిఖ్ హమీద్ రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.
వేర్పాటువాదులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడంతో... ఈ ఉప ఎన్నికలో కేవలం 7శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తొలుత ఏప్రిల్ 9(ఆదివారం) ఇక్కడ ఉప ఎన్నికలు జరగగా.. అల్లర్ల కారణంగా అతి తక్కువ పోలింగ్ నమోదైంది. దీంతో అధికారులు తిరిగి ఏప్రిల్ 13న 38 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసలో ఎనిమిది మంది చనిపోయారు.