మోదీని మించిన షారుఖ్
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ట్విట్టర్లో దూసుకుపోతున్నాడు. తాజాగా ఫాలోవర్ల సంఖ్యలో ప్రధాని నరేంద్రమోదీని ఆయన అధిగమించారు. ప్రస్తుతం షారుఖ్ 16 మిలియన్ల ఫాలోవర్లతో ఇండియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగి ఉన్న వారిలో రెండవ స్థానంలో నిలిచారు. మోదీ 15.8 మిలియన్ల ఫాలోవర్లతో 3వ స్థానంలో ఉండగా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 17.6 మిలియన్ల ఫాలోవర్లతో మొదటి స్థానంలో ఉన్నారు.
ఇండియాలో అసహనం తీవ్రంగా ఉందన్న షారుఖ్ వివాదాస్సద ప్రకటన నేపథ్యంలో ఆయన ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2010 జనవరి 3న ట్విట్టర్లో జాయిన్ అయిన షారుఖ్.. క్రమం తప్పకుండా అభిమానులతో టచ్లో ఉంటున్నాడు. తన సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు ఫ్యామిలీ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ అంతకంతకూ తన ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాడు. షారుఖ్ ప్రస్తుతం కాజోల్ హీరోయిన్గా రోహిత్ శెట్టి దర్శకత్వంలో దిల్వాలే చిత్రంలో నటిస్తున్నాడు.