కలెక్టర్ సందీప్(పాత ఫొటో)
సాక్షి, చెన్నై : తమిళనాడు తూత్తుకుడి జిల్లా కలెక్టర్‌గా తెలుగు వ్యక్తి నండూరి సందీప్ నియమితులయ్యారు. గురువారం ఆయన జిల్లా కలెక‍్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కాగా తూత్తుకుడిలో జరిగిన హింసాత్మక ఘటనల్లో మృతి చెందినవారి సంఖ్య 13కు చేరగా, 70 మంది గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎన్ వెంకటేశన్, ఎస్పీ పీ మహేంద్రన్‌లపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తూత్తుకుడిలో అయిదు రోజుల పాటు ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు.
తూత్తుకుడి పట్టణంలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్ (రాగి) యూనిట్ విస్తరణ ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తోన్న స్థానికులు గడిచిన 100 రోజులుగా నిరసనలు చేపట్టారు. అయితే నిరసనోద్యమం మంగళవారం నాడు ఒక్కసారిగా హింసాయుత మలుపు తిరిగింది. పెద్ద సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు.
వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరుపగా 13 మంది ఆందోళనకారులు చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా అలజడిరేపిన ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు సైతం కలుగజేసుకుంది. కాపర్ ప్లాంట్ విస్తరణను నిలిపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అరెస్ట్..
మరోవైపు తూత్తుకుడి సంఘటనపై ప్రభుత్వ వివరణ డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డీఎంకే ఎమ్మెల్యేలు గురువారం చెన్నైలోని సెక్రటేరియట్లోకి దూసుకెళ్లటం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు వారిని అడ్డుకోవటంతో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ సెక్రటేరియట్ ముందు ఆందోళనకు దిగారు.
ఆయనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఆందోళన చేస్తున్న స్టాలిన్ తదితరులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనను నిరసిస్తూ డీఎంకే శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది. ఇక తూత్తుకుడిలో అల్లర్లు సృష్టించారన్న ఆరోపణలతో ఇప్పటివరకూ 67 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment