
'తమిళనాడులో త్వరలో కొత్త ప్రభుత్వం'
సాక్షి, చెన్నై: తమిళనాడులో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీఎంకే, దినకరన్ వర్గాలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని ఆయన జోస్యం చెప్పారు. 'తమిళనాడుకు గొప్ప ఎదురుదెబ్బ తగలనుంది. స్టాలిన్, దినకరన్ కలిసి కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని కొద్ది రోజుల్లో ఏర్పాటు చేయనున్నార'ని ఆయన ట్వీట్ చేశారు.
మరోవైపు పళనిస్వామి ప్రభుత్వానికి పడగొట్టేందుకు ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. డీఎంకే, కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకులు ఆదివారం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును కలిశారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే శాసనసభా పక్ష ఉప నేత దురై మురుగన్ నేతృత్వంలో ఓ బృందం రాజ్‌భవన్‌కు వెళ్లింది. డీఎంకే ఎంపీలు కనిమొళి, ఆర్‌ఎస్ భారతి, ఓ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ థరణి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అబూబక్కర్‌లు 15 నిమిషాలపాటు గవర్నర్‌తో భేటీ అయ్యారు. స్టాలిన్ తరపున వినతి పత్రాన్ని సమర్పించారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మీడియాతో దురై మురుగన్ మాట్లాడారు. బల పరీక్షకు ఆదేశాలివ్వాలని ఇప్పటికే లేఖలు రాశామని, ప్రస్తుతం స్వయంగా గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేశామని చెప్పారు.
మరి కొద్ది రోజులు చెన్నైలో గవర్నర్
రాష్ట్రంలో సాగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరికొద్ది రోజులపాటు గవర్నర్ విద్యాసాగర్‌రావు చెన్నైలోనే ఉండనున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఓ వైపు, డీఎంకే, కాంగ్రెస్ శాసనసభా పక్షాలు మరోవైపు సీఎం పళని స్వామి విశ్వాస పరీక్ష కోసం విజ్ఞప్తులు చేసిన దృష్ట్యా అందుకు తగ్గ కసరత్తుల్ని గవర్నర్ మొదలెట్టినట్టు సమాచారం.