డార్జిలింగ్: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా యూపీఏ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దేశంలోని పలుచోట్ల ఇప్పటికే ‘ప్రత్యేక’ ఉద్యమాలు ఉపందుకోగా, తాజాగా ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలోనూ ‘ప్రత్యేక’ నిరసనలు మొదలయ్యాయి. డార్జిలింగ్, అస్సాంలలో బంద్‌లు ఉధృతమైయ్యాయి. మేఘాలయలో గారో, ఖాసీ-జయింతియా గిరిజన ప్రాంతాలను రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలంటూ ఐదు జిల్లా కేంద్రాల్లో మంగళవారం నిరసనలు మొదలయ్యాయి.
గారో హిల్స్ రాష్ట్ర ఉద్యమ కమిటీ, హిల్స్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ , గారో నేషనల్ కౌన్సిల్ తదితర పార్టీలు, ప్రజా సంస్థలు దాదాపు ఇరవయ్యేళ్లుగా ప్రత్యేక రాష్ట్రాల కోసం డిమాండ్ చేస్తున్నాయి. భాషా ప్రాతిపదికన గారోలాండ్, ఖాసీ-జయింతియా రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని జీఎన్‌సీ ఎమ్మెల్యే క్లిఫర్డ్ మారక్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.