కలహం మాని కలుద్దాం: షరీఫ్ పిలుపు
కఠ్మాండు: సార్క్ దేశాలు సహకారాన్ని పెంపొందించుకుని సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సూచించారు. పరస్పరం కలహించుకోవటం మానుకుని ఇంధన భద్రత, పేదరికం, నిరుద్యోగం తదితర సమస్యలపై ఐక్యంగా పోరాడాలన్నారు. బుధవారం కఠ్మాండులో సార్క్ దేశాల సదస్సులో ఆయన మాట్లాడారు. దక్షిణాసియాను వివాద రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. పరిశీలక దేశాలది కూడా సార్క్‌లో కీలక పాత్రేనన్నారు. వాటితో చర్చించటం ద్వారా సార్క్ దేశాలు ప్రయోజనం పొందాలని ఆకాంక్షించారు. నమ్మకం ఆధారంగా మైత్రి కొనసాగాలని సూచించారు. ఉగ్రవాదం ఉమ్మడి శత్రువని సార్క్ సదస్సుకు ఆతిథ్యమిస్తున్న నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత తదితర అంశాలపై కలసికట్టుగా పోరాడాలన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కల్పించి వలసలను అరికట్టాలన్నారు.
సార్క్ దేశాల్లో 25 శాతం జనాభా ఇంకా పేదరికంలోనే మగ్గుతోందని శ్రీ లంక అధ్యక్షుడు మహింద రాజపక్స చెప్పారు. పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించాలని తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. తమ భూభాగం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తూ పొరుగువారికి హాని తలపెట్టటాన్ని అనుమతించబోమని అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని స్పష్టం చేశారు. ప్రపంచ జనాభాలో 1/5 శాతం ఉన్న సార్క్ దేశాలు పేదరిక నిర్మూలనకు ఆహార బ్యాంక్ ఏర్పాటు చేసుకోవాలని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పేర్కొన్నారు. వాతావరణ మార్పులపై దక్షిణాసియా దేశాలు అత్యవసరంగా స్పందించాల్సి ఉందని మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ పేర్కొన్నారు.