న్యూఢిల్లీ : ఆటో డ్రైవర్‌కి, పోలీసులకు మధ్య జరిగిన ఓ వీధి పోరాట దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వివరాలు.. గ్రామీణ్ సేవ ఆటో ఒకటి ముఖర్జి నగర్‌లో పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో పోలీసులు సదరు ఆటో డ్రైవర్‌ని, అతని కుమారున్ని బయటకు లాగి చితకబాదారు. బూటు కాలితో తంతూ.. డ్రైవర్‌ని రోడ్డు మీద ఈడ్చుకెళ్లారు. ఆగ్రహించిన ఆటో డ్రైవర్ తిరగబడటమే కాక వెంట తెచ్చుకున్న కత్తితో పోలీసుల మీద దాడి చేసేందుకు యత్నించాడు. ఈ తతంగాన్నంత ఓ వ్యక్తి వీడియో తీసి ఇంటర్నెట్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పోలీసుల తీరుపై నెటిజన్లు మండి పడుతున్నారు.
అయితే ఈ వివాదంపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఆటో డ్రైవర్ పోలీసు వాహనాన్ని ఢీకొట్టాడని.. ఇద్దరు అధికారుల తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు ఆరోపిస్తున్నారు. అన్యాయంగా పోలీసులు తన మీద దాడి చేశారని సదరు ఆటో డ్రైవర్ వాపోతున్నాడు. అయితే ఈ ఘటనలో పోలీసులనే విమర్శిస్తున్నారు నెటిజనులు. ఈ సంఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. ‘ముఖర్జి నగర్‌లో జరిగిన సంఘటన చాలా దారుణమైంది, అన్యాయమైంది. పోలీసుల తీరును నేను ఖండిస్తున్నాను. దీని గురించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఆదేశిస్తున్నాను’ అన్నారు. ఈ ఘటనపై సీఎం కూడా స్పందిచడంతో ఉన్నతాధికారులు గొడవకు బాధ్యులైన ఓ ఎస్సైని, కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment