
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో మెట్రో రైలు ప్రయాణం సామాన్యుడి జేబుకు అందనంత దూరంలో ఉంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) చేపట్టిన అథ్యయనంలో ఢిల్లీ మెట్రో ప్రపంచంలోనే ఖరీదైన మెట్రో ప్రయాణంలో రెండవదిగా నిలిచింది. గత ఏడాది మెట్రో రైలు చార్జీలు పెంచిన అనంతరం ప్రపంచంలోనే అతిఎక్కువ చార్జీలు కలిగిన రెండవ మెట్రో సర్వీసుగా ఢిల్లీ మెట్రో అవతరించింది.
ప్రపంచంలో తొమ్మిది మెట్రపాలిటన్ నగరాల్లో పది కిలోమీటర్ల ప్రయాణానికి సగం డాలర్‌లోపే ఖర్చవుతుండగా, ఢిల్లీ మెట్రోలో ప్రయాణించేందుకు ప్రయాణీకులు తమ ఆదాయంలో చేస్తున్న ఖర్చు శాతం ఆధారంగా ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెట్రో ప్రయాణాల్లో రెండవదిగా నిలిచిందని సీఎస్‌ఈ అథ్యయనం వెల్లడించింది.
ఢిల్లీలో మెట్రో జర్నీపై ప్రయాణీకులు తమ ఆదాయంలో 14 శాతం ఖర్చు చేస్తుండగా, అత్యధికంగా వియత్నాంలోని హనోయిలో ప్రయాణీకులు మెట్రో జర్నీ కోసం తమ ఆదాయంలో ఏకంగా 25 శాతం వెచ్చించాల్సి వస్తోంది. ఢిల్లీలో దినసరి కార్మికుడు నాన్ ఏసీ బస్సులో వెళ్లేందుకు తన ఆదాయంలో 8 శాతం, ఏసీ బస్‌లో వెళ్లేందుకు 14 శాతం ఖర్చు చేయాల్సి ఉండగా, ఢిల్లీ మెట్రోలో వెళ్లాలంటే మాత్రం తన రాబడిలో ఏకంగా 22 శాతం ఖర్చు చేయాల్సి వస్తోందని ఈ అథ్యయనం విశ్లేషించింది.
Comments
Please login to add a commentAdd a comment