మయన్మార్‌లో మారణకాండ
► కొత్తగా బంగ్లాకు 87 వేల మంది రోహింగ్యా శరణార్థులు
► సిద్ధంగా మరో 20వేల మంది
కాక్స్‌బజార్/న్యూఢిల్లీ: మయన్మార్‌లో చెలరేగిన హింస కారణంగా గత పది రోజుల్లోనే దాదాపు 87,000 మంది రోహింగ్యా ముస్లింలు రఖైన్ రాష్ట్రం నుంచి బంగ్లాదేశ్‌కు పారిపోయి వచ్చినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. సరిహద్దుల గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించడానికి మరో 20 వేల మంది సిద్ధంగా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. మయన్మార్ ఆర్మీకి, రోహింగ్యా తీవ్రవాదులకు మధ్య జరుగుతున్న హింస వల్ల ఈ వలసలు మరింతగా పెరిగే ప్రమాదముందని ఐరాస హెచ్చరించింది.భారీ వర్షాలకు నిలువనీడ లేక బంగ్లా ప్రభుత్వం ఏర్పరచిన శిబిరాల సమీపంలోనే రోహింగ్యాలు అందరూ కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ హింసలో 86 మంది హిందువులు మృతి చెందడంతో దాదాపు 500 మంది హిందువులు రోహింగ్యాలతో కలసి బంగ్లాదేశ్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మయన్మార్ సైన్యం దాడుల నేపథ్యంలో పదుల సంఖ్యలో రోహింగ్యాలు బుల్లెట్ గాయాలతో కాక్స్‌బజార్‌లోని సదర్ హాస్పిటల్‌లో చేరినట్లు వైద్యాధికారి షాహిన్ అబ్దుర్ రెహ్మన్ చౌధురీ తెలిపారు. బ్రిటిష్ వారి హయాంలో అప్పటి అవిభక్త బెంగాల్ నుంచి వెళ్లి మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో స్థిరపడ్డ రోహింగ్యా ముస్లింలను పౌరులుగా గుర్తించడానికి మయన్మార్ పాలకులు నిరాకరిస్తూనే వచ్చారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌లో 4 లక్షల మంది రోహింగ్యాలు ఆశ్రయం పొందుతున్నారు.
ఇదిలాఉండగా, భారత్‌లో అక్రమంగా ఆశ్రయం పొందుతున్న రోహింగ్యా ముస్లింలను మయన్మార్‌కు తిప్పిపంపే విషయంలో తమ అభిప్రాయాన్ని తెలపాలని సుప్రీం కోర్టు సోమవారం కేంద్రాన్ని ఆదేశించింది. రోహింగ్యాలను తిప్పిపంపాలన్న కేంద్రం నిర్ణయాన్ని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సవాల్ చేశారు.