షహాబుద్దీన్ బెయిల్ రద్దు
ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షహాబుద్దీన్‌కు పట్నా హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దుచేసింది. రాజీవ్ రోషన్, అతడి ఇద్దరు సోదరుల హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడిన షహాబుద్దీన్.. 11 ఏళ్ల తర్వాత హైకోర్టు బెయిల్‌తో బయటకు వచ్చారు. అయితే ఆయన బయటకు రాగానే ఒక్కసారిగా అనుచరులు హల్‌చల్ చేశారు. దాంతోపాటు బాధిత కుటుంబాలు కూడా ఆయన బయటకు రావడం వల్ల తమకు ప్రాణాపాయం ఉందని చెప్పాయి.
షహాబుద్దీన్‌కు పట్నా హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నితీశ్ కుమార్ ప్రభుత్వం కూడా బెయిల్ రద్దును కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లను శుక్రవారం విచారించిన సుప్రీం ధర్మాసనం.. షహాబుద్దీన్ బెయిల్‌ను రద్దుచేస్తూ ఉత్తర్వులిచ్చింది. అతడిని వెంటనే మళ్లీ జైలుకు తరలిస్తారని ప్రశాంత భూషణ్ తెలిపారు. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంతో షహాబుద్దీన్ ఇవాళ మధ్యాహ్నం శివాన్ జిల్లా కోర్టులో లొంగిపోయారు.
కాగా మహ్మద్ షాబుద్దీన్.. బిహార్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నేత. భయానకమైన నేరచరిత్ర, విజయవంతమైన రాజకీయ ప్రస్థానం.. ఈ రెండూ కలిపితే షాబుద్దీన్. బిహార్లో ఆయన పేరు వింటే ప్రత్యర్థులు, అధికార యంత్రాగం హడలిపోతారు. రెండు దశాబ్దాల పాటు నేరాలను, రాజకీయాలను సమాంతరంగా నడిపాడు. సొంత బలగాలను ఏర్పాటు చేసుకుని ఓ దశలో సమాంతర ప్రభుత్వాన్ని కూడా నడిపాడు. లాలూకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే షహాబుద్దీన్.. ఆయనకే తాను విధేయుడిగా ఉంటాను తప్ప నితీష్ కుమార్‌కు కాదని కూడా చెప్పాడు. చివరకు బెయిల్ రద్దు కావడంతో మాజీ ఎంపీతో పాటు మాజీ సీఎం లాలూకు కూడా ఎదురుదెబ్బ తగిలినట్లయింది.