ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన చిన్నారి హత్యకేసులో నిందితుడి తరఫున వాదనలు వినిపించవద్దని గుర్గావ్ డిస్ట్రిక్ బార్ అసోసియేషన్ చేసిన తీర్మానాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
న్యూఢిల్లీ: ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన చిన్నారి హత్యకేసులో నిందితుడి తరఫున వాదనలు వినిపించవద్దని గుర్గావ్ డిస్ట్రిక్ బార్ అసోసియేషన్ చేసిన తీర్మానాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఎలాంటి కేసులోనైనా లాయర్లను వాదించవద్దని చెప్పే హక్కు ఎవరికీ లేదని.. అది చట్టవిరుద్ధం అని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ ఖన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌ల ధర్మాసనం సోమవారం వెల్లడించింది.
బార్ అసోసియేషన్ తన తీర్మానాన్ని ఉపసంహరించుకుందని సంస్థ తరఫున హాజరైన న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ర్యాన్ గ్రూప్ అధినేత ఫ్రాన్సిస్ థామస్ తరఫున ఎవరూ వాదించవద్దని బార్ అసోసియేషన్ చేసిన తీర్మానం సరికాదని సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ, అడ్వొకేట్ సందీప్ కపూర్ తమ వాదనలు వినిపించారు. ఈ నెల 8న ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రెండవ తరగతి విద్యార్థి ప్రద్యుమ్న అనే విద్యార్థి కిరాతకంగా హత్యకు గురైన విషయం తెలిసిందే.